తేజస్వీ యాదవ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే ప్రతిపక్షాలన్ని ఈగోలు పక్కన పెట్టి ఉమ్మడిగా పోటీ చేయాలని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తరువాత నిర్ణయించుకోవచ్చని, మొదట ప్రతిపక్ష పార్టీలన్ని ఉమ్మడిగా పోటీచేయాలని పేర్కొన్నారు. యూపీఏ-1లో విపక్షాలన్ని కలిసి పోటీ చేశాయని, విజయం అనంతరం మన్మోహన్ సింగ్‌ని ప్రధానిగా ఎన్నుకున్నాయని గుర్తుచేశారు. జూలై మొదటి వారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు బిహార్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఓ వార్త సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్లు వంటి అంశాల ప్రమాదంలో పడే అవకాశముందని వాటిని రక్షించేందుకు లౌకిక శక్తులన్ని ఏకం కావాల్సిన అవసరముందన్నారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తోందని, అది దేశానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోని వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చుతామన్న కే్ంద్రమంత్రి అనంతకుమార్ లాంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ తలపడుతున్నాయని, యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయని గుర్తుచేశారు.
బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా మోదీ తీర్చలేకపోయారని విమర్శించారు. బిహార్ సీఎం నితీష్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment