న్యూఢిల్లీ: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా ఐక్య గళం వినిపించిన ప్రతిపక్షాలు బీజేపీని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఢీకొట్టేందుకు 400 స్థానాల్ని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఈ ప్రణాళిక వివరాల్ని ఎన్సీపీ నేత మజీద్ మెమన్ ధ్రువీకరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే దీనిపై కసరత్తు జరిగిందని న్యూస్ 18 చానల్‌కు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ప్లాన్ అమలు చేయడం ఉత్తమమని, దేశమంతా ఒకే ఫార్ములాతో ముందుకెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదనేది ప్రతిపక్ష నేతల అభిప్రాయమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
యూపీని ఉదాహరణగా తీసుకోవాలి: సమాజ్‌వాదీ
యూపీలో బీఎస్పీ, ఎస్పీలు కలిసికట్టుగా బీజేపీని ఓడించిన ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి యూపీలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల ఎస్పీ, బీఎస్పీలు బలపర్చిన ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించారు. ‘అయితే కొన్నిచోట్ల మాత్రమే పొత్తులు ప్రయోజనకరం. కైరానాలో కాంగ్రెస్ మద్దతు మాకు లాభించింది. ఫూల్పూర్ వంటి చోట్ల ఆ పార్టీతో పొత్తు ప్రమాదకరం’ అని ఎస్పీ నేత ఒకరు పేర్కొన్నారు. ఫూల్పూరులో ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ చేరకపోవడం లాభించిందని, ఆ పార్టీకి ఆ ప్రాంతంలో బ్రాహ్మణ పార్టీ ముద్ర ఉందని ఆయన విశ్లేషించారు.
మమతా బెనర్జీ కీలక పాత్ర
యూపీ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం.. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి బీజేపీని నేరుగా ఢీకొనే ప్రణాళికను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలకు కాంగ్రెస్ మద్దతివ్వాలని ఆమె సూచించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి–అఖిలేశ్‌ల కూటమి బలంగా ఉంది. వారు కలిసి పోరాడితే మనం వాళ్లకు సాయపడాలి’ అని మమత అప్పట్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ వెనుక నుంచి మద్దతు ఇవ్వడమే సరైందని చెప్పారు.
‘బెంగాల్లో మమతా బెనర్జీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బిహార్‌లో తేజస్వీ యాదవ్ ఊపుమీదున్నారు. కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు పంచుకునేందుకు వారు ఒప్పుకుంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఐక్యకూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలక పాత్ర పోషిస్తుందని, అయితే డిసెంబరులో జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పాత్ర తేలిపోతుందని అన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికలయ్యాకక కూటమిపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment