
పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
సాక్షి, తూర్పుగోదావరి : ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న వేళ జిల్లాలో టీడీపీకి భారీషాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పిఠాపురంలో శనివారం జరిగే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు నారాయణమూర్తి అనుచరగణం వెల్లడించింది. పి.గన్నవరం టికెట్‌ను ఈసారి నేలపూడి స్టాలిన్‌కు కేటాయించడంపట్ల నారాయణమూర్తి తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంలో పడడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఎమ్మెల్యేను బుజ్జగించే యత్నం చేశారు. రాబోయేరోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని నచ్చజెప్పారు. ఇదే విషయాన్ని నేడు కాకినాడ రానున్న సీఎం చంద్రబాబుతో కూడా హామీ ఇప్పిస్తామని చెప్పారు. అయినప్పటికీ నారాయణమూర్తి తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది.