
సాక్షి, అమరావతి: గత 6 నెలలుగా తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న కుట్ర అమరావతి కేంద్రంగానే జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ పునరుద్ఘాటించారు. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలపై మంగళవారం కూడా పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
ఈ కుట్రలో టీడీపీకి మద్దతుగా ఉన్న మీడియా చానల్స్ అధినేతలు, వాటి భాగస్వాములు, పెట్టుబడిదారులకు, బోర్డులకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు. దీనికి సమాధానం ఇవ్వడానికి వారికి సరిపడా సమయం ఇస్తానని తెలిపారు. అలాగే టీవీ 9 సీఈవో రవిప్రకాశ్‌కు వ్యతిరేకంగా గతంలో ఓ వ్యక్తి రాసిన బహిరంగ లేఖలను మంగళవారం ఉదయం పవన్ ట్వీటర్‌లో ఉంచారు. ఈ వార్తలపై కూడా టీవీ 9లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.