
సాక్షి, హైదరాబాద్: ఓట్ల తొలగింపుపై పోలీసులు విచారణ చేస్తే మీకెందుకు భయం పట్టుకుందని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన కురబలకోట మండలం జెడ్‌పీటీసీ ధనలక్ష్మి భర్త ఎం.రంగారెడ్డితో కలిసి లోటస్‌పాండ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఏ విధంగా ఓట్లు తొలగిస్తుందో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుటుంబసభ్యుల ఓట్లనే తొలగించే ప్రయత్నం చేశారంటే.. ఇక సాధరణ ప్రజల పరిస్థితేంటో అర్థం చేసుకొవచ్చన్నారు. టీడీపీ కుట్రలకు వివేకానందరెడ్డి ఓటు తొలగింపే సాక్ష్యమన్నారు. సర్వేల పేరిట ఇళ్లకు వచ్చి ఓట్లు తొలగిస్తున్న టీడీపీ కుట్రను బయటపెట్టామన్నారు. దీంతో ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారన్నారు.
ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అంత సులభంగా వదలమని చెప్పారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని.. ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్తామని చెప్పారు. తప్పు చేయడం వల్లే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చంద్రబాబు తనయుడు నారా లోకేశే పెద్ద ఆస్తి అని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు ఓటు విలువ తెలియదని.. ఓటింగ్ ద్వారా గెలిచింది కూడా లేదని ఎద్దేవా చేశారు. లోకేశ్ తెలివితక్కువ స్టేట్‌మెంట్ల వల్ల వైఎస్సార్‌సీపీకే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. కాగా, రంగారెడ్డి చేరికతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీకి బలం చేకూరిందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి రంగారెడ్డి సన్నిహితుడని.. ఆయనకు ప్రజల్లో మంచి పేరుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి వైఎస్ జగన్‌కు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయానికి వచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న నాయకులంతా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చి చేరుతున్నారన్నారు.