ఇదేనా మీ నీతి చంద్రబాబూ: మిథున్ రెడ్డి
తాను నిజాయితీ పరుడినని, నిప్పునని పదే పదే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయించకుండానే మంత్రులుగా ఎలా ప్రమాణం చేయిస్తారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీసీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకుని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై చిత్తూరు జిల్లా పీలేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడమేనా చంద్రబాబు నీతి అంటూ ప్రశ్నించారు. తాను దేశ రాజకీయాల్లో సీనియర్‌ని అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
తన కుమారుడు లోకేష్‌ని మంత్రిని చేయడం కోసమే మంత్రివర్గ విస్తరణ అంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. సుమారు 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, ఎస్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం ద్వారా చంద్రబాబు నిజస్వరూపం బయట పడిందనని మిథున్ రెడ్డి విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.