గుంటూరు రూరల్: తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని నూర్‌బాషా దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు పీర్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు శివారుల్లోని గోరంట్ల గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా నూర్‌బాషా, దూదేకులున్నారని 2014లో టీడీపీ విజయానికి తామంతా ఎంతో కష్టపడితే చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. నూర్‌బాషాలకు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే తామంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీకి ఒక్కరోజు సమయం ఇస్తున్నామని, వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూర్‌బాషా దూదేకుల సంఘం నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో తమ సంఘం ప్రతినిధులు పలుమార్లు కలిసేందుకు వెళ్లగా కనీసం అవకాశం ఇవ్వకుండా చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నాయకులు డీపీ మస్తాన్, షేక్‌బాజీ, షేక్ సుభాన్, ఆదం షఫీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment