
అయోధ్యలో దిగ్గజ నేతల ర్యాలీలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దిగ్గజ నేతల ర్యాలీలకు అయోధ్య వేదికగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్నికల ప్రచార ర్యాలీలతో అయోధ్య హోరెత్తనుంది. అయోధ్యకు 27 కిమీ దూరంలోని గోసాన్‌గంజ్‌లోని మాయాబజార్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరగనుంది. ఇప్పటివరకూ ప్రధాని ప్రసంగాలు అభివృద్ధి, ఉగ్రవాదం, కాంగ్రెస్ వైఫల్యాల చుట్టూ సాగగా, అయోధ్య వేదికగా రామమందిర అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఇక ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రామ్‌సనేహి ఘాట్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు నేడు ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. రామ్‌సనేహి ఘాట్ అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండటం గమనార్హం. మే 6న అయిదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది.
ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా బీజేపీని ఢీకొంటున్న క్రమంలో అయోధ్య వేదికగా మోదీ లక్ష్యంగా అగ్రనేతలు ఇద్దరూ విమర్శలతో విరుచుకుపడనున్నారు. మొత్తంమీద కీలక రాష్ట్రం యూపీలోని అయోధ్యలో అగ్రనేతల వరుస ర్యాలీలతో సందడి నెలకొంది.