న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డీఏ పక్షాలు అధికారంలో ఉన్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 119 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మిత్రపక్షాలు 108 సీట్లు గెలుచుకున్నాయి హరియాణా, ఢిల్లీలలోని మొత్తం సీట్లను(17) బీజేపీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కాషాయపక్షం సంకీర్ణ భాగస్వామి శివసేనకు 19 లోక్‌సభ సీట్లు దక్కాయి. బిహార్‌లోని 40 సీట్లలో ఎన్‌డీఏలోని బీజేపీ, జేడీయూ చెరో 16 స్థానాలు, లోక్‌జన్ శక్తి పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నాయి.
ఢిల్లీలో త్రిముఖ పోటీ?
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పాలకపక్షమైన ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్‌లతో బీజేపీకి త్రిముఖ పోటీ తప్పదు. 2015 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 67 కైవసం చేసుకోగా బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేక మూడో స్థానానికి దిగజారింది. గత ఏడాది నవంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయిదు నెలల క్రితం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11లో రెండు స్థానాలే సాధించగలిగింది.
మధ్యప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీరు గమనించి కొన్ని రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలెవరో అంచనా వేసి చెప్పడం కుదిరేపని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలు మారడమే దీనికి కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పరిగణించే అంశాలకూ, అసెంబ్లీ ఎన్నికలల్లో వారిని కదిలించే విషయాలకూ మధ్య ఉండే తేడాల వల్ల గెలిచే పార్టీలపై జోస్యం చెప్పడం చాలా కష్టమని చండీగఢ్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు ఘనశ్యామ్ దేవ్ అభిప్రాయపడ్డారు.
ఇక అసెంబ్లీ వంతు!
Published Sat, May 25 2019 2:00 AM | Last Updated on Sat, May 25 2019 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment