సాక్షి, కరీంనగర్ : ఎన్నికల్లో అభ్యర్థులతో కాకుండా.. డబ్బు సంచులతో పోటిపడ్డామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఫలితాలు తారుమారై, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజాకూటమిపై వ్యతిరేకంగా చేసిన ప్రచారం వారికే నష్టం కలిగించిందన్నారు. ముందస్తుగా శాసనసభను ఎందుకు రద్దు చేశారో చెప్పకపోవడాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. తమ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన టీఆర్‌ఎస్.. తిరిగి దాన్నే కాపీ కొట్టిందని ఎద్దేవ చేశారు. ప్రకటనల పేరిట కోట్లరూపాయలు ఖర్చు చేసామని చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. ఇప్పటికీ కేటీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారంటే.. ఫలితాలు తెలిసి భయపడైనా ఉండాలని, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ అయినా చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు.
తాము వేసుకున్న కండువాలు చూసి కేటీఆర్ భయపడుతున్నారని, తమ పొత్తులు బహిరంగమన్నారు. కానీ టీఆర్‌ఎస్.. బీజేపీ,ఎంఐఎం కండువాలు వేసుకోకున్నా.. వారి పొత్తులు నిజం కదా? అని ప్రశ్నించారు. ఈవీఎంల వద్ద మా తరఫున మూడు షిప్ట్‌ల్లో కాపాలా కాస్తున్నామని తెలిపారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేసానని తనపై టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తాను పోటీ చేస్తున్నా అనగానే గంగులకు భయపట్టుకుందని, ప్రస్టేషన్‌తో ఇంట్లో టీవీ, సెల్‌ఫోన్లు పగులగొట్టుకున్నాడని తెలిపారు. అవినీతిపరుడైన గంగుల అన్ని విధాల ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బులు, అహంకారం ఉన్నవాళ్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉందని, అవసరమైతే గజ్వేల్‌లా అంతటా వీవీ ఫ్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment