
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెల్లువెత్తుతుండగా.. మరో కీలక నేత కూడా పార్టీ మారబోతోన్నట్లు ప్రచారం సాగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారుబోతున్నానని అనడం సబబు కాదని, ఏ పరిస్థితుల్లోనూ పార్టీ మారనని అఫిడవిట్ ఇస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాను ఏడు ముక్కలు చేశారని, కరీంనగర్‌కు మెడికల్‌కాలేజ్ ప్రకటించి ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని మోసం చేశారని విమర్శించారు. పోరాడితే పొన్నంలాగా పోరాడాలని కేసీఆర్ ఉద్యమ సమయంలో అన్నారని గుర్తు చేశారు. పాఠశాల బస్సులను ఎన్నికలకు ఉపయోగించారని.. అయినా ఎలక్షన్ కమీషన్ చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.