ప్రకాశ్ రాజ్.. నరేంద్ర మోదీ(జత చేయబడిన చిత్రం)
మైసూరు: బీజేపీకి తప్ప వేరే ఏ పార్టీకైనా ఓటేయాలని నటుడు ప్రకాశ్ రాజ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మైసూరులో నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. గుజరాత్ యువ ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్రసంగిస్తూ...
‘బీజేపీ అధికారంలోకి వస్తే గనుక రెడ్డి సోదరులు ఆధిపత్యం చెలాయిస్తారు. యెడ్యూరప్ప ఓ రబ్బర్ స్టాంప్‌గా మారిపోతారు. మధ్యలోనే ఆయన్ని గద్దె దింపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొత్తుల విషయంలో ప్రస్తుతం ప్రజల్లో గందరగోళం నెలకొంది. బీజేపీతో జత కట్టే ప్రసక్తే లేదని జేడీఎస్ అధినేత దేవగౌడ చెబుతున్నారు. కానీ, ఆయన తనయుడు కుమారస్వామి మాత్రం మౌనంగా ఉండటం నన్ను కలవరపెడుతోంది’ అని రాజ్ తెలిపారు.
మోదీ ఓ సుళ్లేంద్ర... మోదీ అంటేనే విరుచుకుపడే ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ అధికారం కోసం నరేంద్ర మోదీ దిగజారారు. తనకు ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేస్తున్నారు. గతంలో ఏ ప్రధాని కూడా చెప్పనన్ని అబద్ధాలు మోదీ చెప్పారు. ఈ విషయంలో ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అందుకే ఆయనకు సుళ్లేంద్ర అన్న బిరుదు ఇస్తున్నా. కన్నడలో దానర్థం అబద్ధాలకోరు’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
ఆలోచించి ఓటేయ్యండి... ‘నేను పక్కా బీజేపీ వ్యతిరేకిని. గాలి బద్రర్స్‌ను క్షమించామని బీజేపీ చెబుతోంది. కానీ, 15 సీట్ల కోసం అవినీతి పరులను తిరిగి అక్కున చేర్చుకోవటం ఎంత వరకు సమంజసం?. అందుకే ఆ పార్టీని ఓడించాలని నేను పిలుపునిచ్చా. అలాగని మిగతా పార్టీలకు నేను అనుకూలం కాదు. ఆలోచించి ఓటేయాలని కన్నడ ప్రజలను నేను కోరుతున్నా’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
‘మోదీ గజ దొంగ’... ఇక ఈ కార్యక్రమంలో దళిత యువ నేత జిగ్నేశ్ మేవానీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓడించటం సాధ్యమౌతుంది. మోదీ ఓ గజదొంగ. యువతను ఉద్యోగాల పేరిట దారుణంగా మోసం చేశారు. దళితులకే ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు. కానీ, ఆరెస్సెస్‌కు చెందిన వారికి కూడా బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోతోంది. అత్యాచారాలపై మౌనంగా ఉండే మోదీ.. అసభ్య వీడియోలను అప్‌లోడ్ చేసే వారిని మాత్రం సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. 50 మందికి పైగా బీజేపీ ఎంపీలపై లైంగిక దాడుల కేసులున్నాయి. బీజేపీ అంటేనే రేపిస్టుల పార్టీ’ అంటూ మెవానీ విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment