
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు సోదరుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరిస్తున్న వేళ.. ప్రియాంక గాంధీ గురించి ఓ ఆసక్తికర కథనం జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలి నుంచి ఆమె కూతురు ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారనేది దాని సారాంశం.
దీనిపై ఎట్టకేలకు ప్రియాంక రాబర్ట్ వాద్రా స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కూడా రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీనే పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఆ స్థానంలో నేను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అక్కడ మా అమ్మే మళ్లీ పోటీ చేయబోతున్నారు’’ అని ప్రియాంక చెప్పారు. తాను చూసిన శక్తివంతమైన మహిళల్లో సోనియా ఒకరని.. అలాంటి వ్యక్తి సేవలు పార్టీకి చాలా కాలం అవసరం ఉందని భావిస్తున్నానని ప్రియాంక చెప్పారు.
కాగా, సోనియాకు అనారోగ్యంగా ఉన్న సమయంలో రాయ్ బరేలి నియోజక వ్యవహారాలను ప్రియాంకనే చూసుకునేవారు. కేవలం అధ్యక్ష పదవి నుంచే తాను తప్పుకుంటాను తప్ప.. రాజకీయాల నుంచి కాదని సోనియా గాంధీ నిన్న స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ కంచుకోట...
తొలిసారి రాయ్ బరేలిలో కాంగ్రెస్ తరపున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేయగా.. భారతీయ లోక్ దల్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో 1977లో ఓడిపోయారు. 1996, 1998లో బీజేపీ రాయ్ బరేలిని కైవసం చేసుకుంది. చివరకు 1999లో కాంగ్రెస్ తొలిసారిగా ఇక్కడ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కంచుకోటగా మార్చుకుంది. ఇక సోనియాగాంధీ 2004లో రాయ్ బరేలిలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే గెలుస్తూ వస్తున్నారు. 2014లో సైతం సోనియా విజయం సాధించి ప్రస్తుతం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment