
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రఘురామ కృష్ణంరాజుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణం రాజు అన్నారు. తన నియోజకవర్గ ప్రజలతో పాటు తాను కూడా దీనినే నమ్ముతున్నందునే వైఎస్సార్‌సీపీలో చేరానని ఆయన వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకుడు అయిన రఘురామ కృష్ణం రాజు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాజు మీడియాతో మాట్లాడారు. అవసరమైతే కేంద్రంతో పోరాడి విభజన చట్టంలోని హామీలు అమలు చేయించే శక్తి, రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించే సామర్థ్యం ఒక్క జగన్‌కే ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీలో చేరడంపై ఆయన మాట్లాడుతూ ‘ఎక్కడైతే నా రాజకీయ ప్రస్థానం మొదలైందో తిరిగి అక్కడికే వచ్చాను. నేను నా సొంత ఇంటికి వచ్చాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా నేను ప్రజలతో కలిసి తిరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నట్లు అర్థమైంది.. నన్ను ఎంతో కోరుకుంటున్న నా నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే నేను పార్టీ మారాను’ అని ఆయన వివరించారు. రఘురామ కృష్ణంరాజుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన అనుచరులు కూడా ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. కాగా ప్రజల్లో బలం కలిగిన రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీలో చేరడం తమ పార్టీకి గట్టి దెబ్బని టీడీపీ వర్గాలు కలవరపడుతున్నాయి.
అందరూ జగన్ వెంటే..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, హోదా సాధించడం వైఎస్ జగన్ ద్వారానే సాధ్యమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని, తటస్థుల్లో సైతం ఇదే విధమైన నమ్మకం ఏర్పడుతోందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. జగన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తాము మహానేత వైఎస్సార్‌ను ఎంతో అభిమానించామని, సీఎంగా ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు వేరెవ్వరూ అమలు చేయలేదని రాజు గుర్తు చేశారు. ‘ఇప్పుడు కూడా కేంద్రంతో పోరాడి విభజన చట్టంలోని హామీలు అమలు చేయించే సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్న విశ్వాసం ప్రజలతోపాటు తనకూ కలిగినందునే ఆయన నాయకత్వంలో పని చేయడం కోసం వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వివరించారు. తనకు తెలంగాణలోగానీ, హైదరాబాద్‌లోగానీ ఎలాంటి వ్యాపారాలు లేవని రాజు స్పష్టం చేశారు. తననెవరూ బెదిరించలేదన్నారు. ప్రజాభిప్రాయంతో పాటు, తనకు వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరానని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని అత్యధికమంది కోరుకుంటున్నట్లు పలు జాతీయ సర్వేలు సైతం తేల్చిన విషయం గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment