సాక్షి, నరసాపురం : జనసేన నేత నాగబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..వాపును చూసి బలుపు అనుకోవద్దని, ఎన్నికల రోజు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందని, ప్రజా తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని హితవు పలికారు. ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు.
రఘురామ కృష్ణంరాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ఇంత లావుగా ఉంటే తంతాం...అంటే భయంతో ఇక్కడ చూస్తూ ఊరుకునివారు ఎవరూ లేరు. ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు, ఛాలెంజ్. నన్ను తంతావో లేదో చూద్దాం రండి. మీరు సినిమాల్లో నటించారుగా... త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో మేము మీకు సినిమా చూపిస్తాం. సొంత ఊరులో లైబ్రరీ పెట్టుకుంటాం అంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకొని అమ్ముకున్న వ్యక్తి నాగబాబు. ఆయన గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసు. ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని కూడా ప్రజలకు తెలుసు. విలువల గురించి మీరా మాట్లాడేది? ప్రజా సమస్యలు అంటే ఇవేనా?. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి చాలు.
నేను పార్టీలు మారడం కాదు. నా సొంత గూటికి తిరిగి వచ్చాను. నేను ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక్కటే కండువా వేసుకున్నా. కానీ మీరు ఏడు కండువాలు ఒకేసారి వేసుకుని తిరుగుతున్నారు. సీపీఎం, సీపీఐ, ఏనుగు నడుముకు పచ్చ కండువా చివరికి కేఏ పాల్ కండువా ఇలా ఏడు వేసుకున్నారు. మీ తీరు వల్ల... మీ సోదరులు మీద ఉన్న గౌరవం, పరువు పోతోంది. ఇక మీరు మీ తమ్ముడు పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొట్టవద్దు. మీరు ప్రశాంతంగా మీ ప్రచారం చేసుకోండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రశాంతమైన జిల్లాలో శాంతిగా ఉండండి.’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment