
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి గురువారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి, భారీ ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంతోపాటు వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఆ స్థానమే ఎందుకు?
ఈ సారి రాహుల్ దక్షిణ భారతదేశం నుంచి పోటీచేయనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని కోరినప్పటికి.. రాహుల్ కేరళలోని వయనాడ్ స్థానాన్ని ఎంచుకోవడం విశేషం. అయితే ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ బరిలో దిగడం వెనుక పెద్ద కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. వయనాడ్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం జనాభా ఎక్కువ ఉండటం, గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలువడమే ఇందుకు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వయనాడ్ లోక్‌సభ స్థానం అవతరించింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లతో వయనాడ్ ఎంపీ స్థానం ఏర్పాటైంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానవాజ్ ఇక్కడ గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని తన సిట్టింగ్ స్థానం అమేథీలో ఓటమి భయంతోనే.. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇక మరోవైపు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకనే కమ్యునిస్ట్‌లు బలంగా ఉండే స్థానాన్ని రాహుల్ ఎంచుకున్నారని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment