
కేరళలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రసంగం అనువాదంలో అపశృతులు దొర్లాయి. రాహుల్ గాంధీ ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని మలయాళంలోకి అనువదించడంలో పార్టీ సీనియర్ నేత పీజే కురియన్ చేసిన పొరపాట్లు రాహుల్‌ను బాగా ఇబ్బంది పెట్టాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించేయడమే కాక తాను ఇప్పటి నుంచి మలయాళం నేర్చుకోవడం మొదలెడతానని చెప్పారంటే కురియన్ అనువాదం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనువాదం తప్పుగా జరుగుతోందని గుర్తించిన రాహుల్ మళ్లీ మళ్లీ చెప్పినా కూడా కురియన్ పొరపాటును సరిదిద్దుకోలేదు.
దాంతో రాహుల్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడమే కాక కురియన్ బదులు వేరొకరిని పెట్టమని కూడా చెప్పినట్టు సమాచారం. కురియన్ అనువాద ప్రహసనపు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై హాస్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని పతనంతిట్టలో రాహుల్ మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సందర్భంగా రాహుల్ ప్రసంగాన్ని కురియన్ మలయాళ భాషలోకి అనువదించారు. సాంకేతిక సమస్యలు, సరిగా వినపడకపోవడం వల్ల పొరపాటు జరిగినట్టు కురియన్ చెప్పారు. కారణాలేవైనా కురియన్ తప్పుడు అనువాదం వల్ల చాలాచోట్ల రాహుల్ చెప్పినదానికి వ్యతిరేకార్థం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై సైద్ధాంతిక పోరాటం చేస్తోందని రాహుల్ అంటే.. కాంగ్రెస్.. బీజేపీ, సీపీఎంలపై పోరాడుతోందని కురియన్ అనువదించారు. కురియన్ చేసిన అనువాద దోషాలిలా ఉన్నాయి.
రాహుల్: సీపీఎం సహా పార్టీల సిద్ధాంతాలను మేం గౌరవిస్తాం
కురియన్: సీపీఎం, బీజేపీల ఆలోచనల్ని మేం గౌరవిస్తాం
రాహుల్: పేదల ఖాతాల్లో రూ.72 వేలు జమ చేస్తాం
కురియన్: పేదల ఖాతాల్లో రూ. 72 వేల కోట్లు జమ చేస్తాం.
తమిళనాడులోనూ అదే తంతు..
రాహుల్ గాంధీ అనువాద బాధలు ఎదుర్కొనడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కన్యాకుమారిలో చేసిన ఎన్నికల ప్రసంగం తమిళ అనువాదంలోనూ ఇలాగే జరిగింది. ఆ ప్రసంగాన్ని కేవీ తంగబాలు అనువదించారు. రాహుల్ తన ప్రసంగంలో ‘..అందుకే మేం తమిళనాడు ప్రజల్ని గౌరవిస్తాం’ అంటే, తంగబాలు ‘నరేంద్రమోదీ తమిళ ప్రజల శత్రువు..’ అంటూ అర్థంలేని అనువాదం చేశారు. అనిల్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేదని రాహుల్ అంటే, ఆయన ఎప్పుడూ నిజం చెప్పలేదని తంగబాలు అనువదించారు. జమ్ము కశ్మీర్‌లో బీమా కార్యకలాపాలన్నింటినీ అనిల్ అంబానీకి అప్పగించారని రాహుల్ విమర్శిస్తే.. జమ్ము,కశ్మీర్‌నే అనిల్‌కు అప్పగించేశారని తంగబాలు అనువదించారు.
Comments
Please login to add a commentAdd a comment