
సాక్షి ప్రతినిధి, చెన్నై: తీవ్ర తర్జనభర్జనలు.. ఎన్నో అనూహ్య పరిణామాలు.. ఐదు రోజులుగా అభిమానులతో వరుస సమావేశాలు.. ఓవైపు సహనటుడు కమల్ ప్రభుత్వాలపై కత్తులు నూరుతున్నా మౌనంగానే పరిస్థితులను గమనిస్తూ వచ్చిన సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఆయన స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇది సత్యం’ అని చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రజనీ నిర్ణయాన్ని అభిమానులతో సహా చిత్ర, రాజకీయ రంగ ప్రముఖులు స్వాగతించారు. కాగా, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో నీతి ముఖ్యం
సుపరిపాలన, నీతితో కూడిన రాజకీయాలపై రజనీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నేటి పరిస్థితుల్లో ప్రతీదీ మారాల్సిన అవసరం కనబడుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ ప్రతి కులం, మతంలో పారదర్శకంగా వెల్లివిరియాలని.. అదే తన రాజకీయ ప్రవేశం ఉద్దేశమని రజనీ అభిలషించారు. తను సొంతంగా ముందుకెళ్లటం కష్టమన్న ఆయన.. తన పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నిస్థానాల నుంచి పోటీచేయడం తథ్యమని వెల్లడించారు. పార్టీ పేరును ప్రకటించకుండా పార్టీ సిద్ధాంతాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి అభిమానులతో సమావేÔ¶శమవుతున్న రజనీకాంత్ చివరి రోజైన ఆదివారం నాడు అభిమానులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. రజనీ ప్రసంగం కొనసాగినంతసేపు అభిమానులు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలిపారు.
రజనీ ఏమన్నారంటే..
‘నాకు జీవితాన్ని ఇచ్చిన అభిమానుల్లారా, తమిళ ప్రజలారా, టీవీలో నా ప్రసంగాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల్లారా.. మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నా అభిమానులను ఎలా కీర్తించాలో తెలియడం లేదు. ఆర్రోజులుగా ఆరువేలకు మందికి పైగా అభిమానులు నాతో ఫొటో దిగేందుకు ఓర్పు, క్రమశిక్షణ పాటించడం చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇదే క్రమశిక్షణ, ఓర్పు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏదైనా సాధించగలమని అర్థమైంది. మనం సరైన దిశగా వెళ్తున్నాం. రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు, మీడియాను చూస్తేనే భయం. బడా వ్యక్తులే మీడియాను చూసి భయపడుతున్నారు. నేనో పసివాడిని. నీ బాధ్యతలు నీవు నెరవేర్చు, మిగతావి నేను చూసుకుంటానని కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. యుద్ధంలో జయిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం ప్రాప్తిస్తుంది. అదే యుద్ధం చేయకుండా వెళ్లిపోతే పిరికిపంద అంటారు.
ఇప్పటికే అన్నీపూర్తి చేశాను. బాణాన్ని గురిచూసి వదలడమే మిగిలింది. నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. ఇదంతా పరిస్థితుల ప్రోద్బలం. తగిన సమయం లేనందున త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటాను. పార్లమెంటు ఎన్నికల నాటికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. నేను రాజకీయాల్లోకి రావడం పేరు ప్రతిష్టల కోసం కాదు, కలలో కూడా ఊహించని వెయ్యింతల పేరు ప్రతిష్టలను అభిమానులు ఇప్పటికే ఇచ్చారు. 1996లోనే కుర్చీ నన్ను వెతుక్కుంటూ రాగా వద్దని చెప్పేశాను. 45 ఏళ్లప్పుడు లేని పదవీ వ్యామోహం 68 ఏళ్లకు వస్తుందా? ఆధ్యాత్మికవేత్త అని పిలిపించుకునేందుకు నాకు అర్హత ఉందా? తమిళనాడు రాజకీయాలు బాగా చెడిపోయాయి. ఏడాదిగా తమిళ రాజకీయాలను చూసి పొరుగు రాష్టాలు నవ్వుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం పరిహాసంగా మారింది. తమిళనాడు ప్రజలకు తలవంపులుగా తయారైంది. ఇంత జరిగినా.. నేను ఓనిర్ణయం తీసుకోకుంటే అది తమిళనాడు ప్రజలకు ద్రోహం చేసినట్లవుతుంది. రాజకీయ వ్యవస్థలో మార్పులు తేవాలి. నీతి, నిజాయితీ కలిగి, మతసామరస్యంతో కూడిన ఆ«ధ్యాత్మిక రాజకీయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. దేవుడి దయ, ప్రజల విశ్వాసం, ప్రేమ, అభిమానంతో ప్రత్యేక పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇందులో విజయం సాధిస్తానని సంపూర్ణమైన నమ్మకం ఉంది. రాజుల కాలంలో యుద్ధాలు చేసి పొరుగు రాజ్యాలను, ఖజానాలను, ప్రజలను కొల్లగొట్టేవారు. కానీ నేడు ప్రజాస్వామ్యం ముసుగులో నేరుగా ప్రజలను దోచుకుంటున్నారు.
నాకు కార్యకర్తలు వద్దు, ప్రజా సంక్షేమం కోరే కాపలాదండు (వాలంటీర్లు) కావాలి. ఎవరు తప్పు చేసినా నిలదీయగల ధైర్యమున్న దండు కావాలి. అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గరు వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లని వాలంటీర్లు కావాలి. ఇలాంటి కాపలాదండుకు నేను ప్రతిని«ధిగా ఉంటాను. గ్రామస్థాయి నుంచి నగరాల వరకు కొన్నివేల సంఘాలు (రిజిస్టర్ అయినవి, కానివి) మనకు ఉన్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవడం ఎంతో ముఖ్యం. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, సత్యం ఇవే నా మొదటి శాసనం. ఇక మనం రాజకీయాలు మాట్లాడరాదు, నేనూ మాట్లాడను. ఎపుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో అపుడు పార్టీ స్థాపిస్తాను. ఆ పార్టీ ద్వారా ప్రజలకు ఏమి చేయగలమో, ఏమి చేయలేమో చెబుతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను మూడేళ్లలోగా నెరవేర్చలేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను’ అని రజనీ పేర్కొన్నారు. తన పార్టీ చిహ్నాన్ని స్పష్టం చేయకున్నా బాబా చిత్రంలోలా రజనీ వేలు మడతలను వేళ్లను మడిచి సంకేతాలు ఇచ్చారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు.
వెల్లువెత్తిన అభిమానం
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. సభాస్థలి ఈలలు, చప్పట్లతో మారుమోగింది. రజనీకాంత్ ప్రసంగాన్ని వినేందుకు వీలుగా రోడ్డుపైన సైతం స్పీకర్లు అమర్చారు. ప్రతి మాటకూ బాణసంచా కాల్చి ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఆనందంతో చిందులువేశారు. ప్రసంగాన్ని ముగించిన అనంతరం బాల్కనీలోకి వచ్చి రజనీకాంత్ చేయి ఊపుతూ, విక్టరీ చిహ్నం చూపుతూ అభివాదం చేయడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. రజనీ ప్రకటనను కవర్ చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియా ఉత్సాహం చూపించింది.
చిత్రరంగం శుభాకాంక్షలు
రజనీకాంత్ నిర్ణయాన్ని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా పలువురు చిత్ర రంగ ప్రముఖులు స్వాగతించారు. సూపర్‌స్టార్ రాజకీయ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియ మిత్రుడు, తోటి నటుడు, వినయం, విధేయతగల మానవతావాది రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘నా సోదరుడు రజనీకాంత్ సామాజిక బాధ్యత, రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నా’ అని హాసన్ పోస్టు చేశారు. రజనీ ప్రకటన 2017 సంవత్సరానికి అతిపెద్ద వార్త ‘జై హో’ అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్ కచ్చితంగా ప్రజాభిమానాన్ని పొందుతారని బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ కూడా రజనీ ప్రకటనను స్వాగతించారు.
మమ్మల్ని ఓడించేవారు పుట్టలేదు: పళనిస్వామి
రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని దీని కారణంగా అన్నాడీఎంకేకు నష్టమేమీ జరగదని తమిళనాడు సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. తమ పార్టీని ఓడించే వారింకా పుట్టలేదని.. ఇకపై పుట్టబోరని ఆయన పేర్కొన్నారు. ఎంజీఆర్, జయలలితలు స్థాపించిన అన్నాడీఎంకేకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవరూ చీల్చలేరన్నారు. ప్రతి భారతీయుడికీ సొంతగా పార్టీ పెట్టుకునే హక్కుందని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళ్‌సాయి సౌందరరాజన్ రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల ఆశలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీని పెట్టడం శుభపరిణామమని డీఎంకే కార్యాధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కూడా రజనీకి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment