
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమే బీజేపీకి అత్యధిక స్థానాలకు సాధించిపెట్టిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. వారి కూటమిని ప్రజలను ఆమోదించలేదని, అందుకే తమ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందిందని అన్నారు. యూపీ రాజధాని లక్నో లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం ఆయన తొలిసారి అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
అధికారం కోసమే దశాబ్ధాల శత్రుత్వాన్ని పక్కనపెట్టి బీఎస్పీ,ఎస్పీలు కూటమి కట్టాయని, వారి కుట్రలను గమనించిన ప్రజలు మరోసారి తమకు అధికారం అప్పగించారని ఆయన పేర్కొన్నారు. యూపీలో 50శాతానికి పైగా ఓట్లు బీజేపీ సొంతం చేసుకుందని, ఆ రెండు పార్టీలు కలిసినా కనీసం 40శాతం ఓట్లుకూడా రాబట్టలేకపోయయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం మరో పార్టీలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన అనేక పథకాలను, ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. కాగా యూపీలో బీజేపీ 62 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.