మోదీ ఆఫర్‌ ఇచ్చారు.. నేనే వద్దన్నా! | Rejected Modis Offer, Cabinet Berth for Daughter | Sakshi
Sakshi News home page

మోదీ ఆఫర్‌ ఇచ్చారు.. నేనే వద్దన్నా!

Published Tue, Dec 3 2019 4:23 AM | Last Updated on Tue, Dec 3 2019 5:42 AM

Rejected Modis Offer, Cabinet Berth for Daughter - Sakshi

ముంబై: ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తానే తిరస్కరించానని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తెలిపారు. రాష్ట్రపతి పదవిని తనకు ప్రధాని ఇవ్వజూపారన్న వార్తలను పవార్‌ కొట్టిపారేశారు. ఓ మరాఠా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన. గత నెలలో ప్రధాని మోదీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ‘కలిసి పనిచేద్దామంటూ మోదీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కానీ, కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’నన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్‌లో చోటు కల్పిస్తామని చెప్పారు’అని పవార్‌ వివరించారు.

దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలిపినందుకే అజిత్‌ పవార్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే కేబినెట్‌లో స్థానం కల్పించలేదన్నారు. ‘అజిత్‌ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేశా. అజిత్‌ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. ‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్‌ పక్షంను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. కానీ, అజిత్‌ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’అని అజిత్‌కు చెప్పానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement