
సాక్షి, చెన్నై, కొయంబత్తూర్: ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు. జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో డిసెంబర్ 21న ఉపఎన్నికలు నిర్వహిస్తామని శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అనంతరం తిరుపూర్‌లో దినకరన్ మాట్లాడుతూ.. రెండాకుల గుర్తు కోసం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు బీజేపీతో కుమ్మక్కై కుట్ర చేశారని ఆరోపించారు. కాగా డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాల్ని విడుదల చేస్తామని, డిసెంబర్ 26 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి లఖోనీ తెలిపారు.
వేలిముద్రల్ని సరిపోల్చాలని నిర్ణయం
గతేడాది ఉప ఎన్నికలవేళ బీ–ఫారాలపై జయలలిత వేలిముద్రల్ని.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో అందుబాటులో ఉన్న జయ వేలిముద్రలతో సరిచూడాలని మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. జయ వేలిముద్రల వివరాల్ని సమర్పించాలని ఆధార్ నియంత్రణ సంస్థ యూఐడీఏఐని కూడా హైకోర్టు కోరింది. మరోవైపు రెండాకుల గుర్తుపై తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ పన్నీర్ సెల్వం సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేశారు.