
నాగపూర్‌లో ఆర్‌స్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వడంపై రాహుల్ గాంధీ అధికారికంగా స్పందించలేదు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఐతే మరోసారి ఆరెస్సెస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఆరెస్సెస్ నిర్వహించనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరితో పాటు మరికొందరు నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆరెస్సెస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో జరిగే సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షత వహించనున్నారు.
నాగపూర్‌లో ఆర్‌స్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వడంపై రాహుల్ గాంధీ అధికారికంగా స్పందించలేదు. కానీ పలువురు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడంపై సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని తెలియజేశారు. అయితే ఆ కార్యక్రమంలో ప్రణబ్ చేసిన ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆరెస్సెస్‌పై ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ పర్యటనలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ ఆరెస్సెస్‌ను అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చారు.