ముదురుతున్న రాజకీయ సంక్షోభం | Sachin Pilot challenging disqualification notice heard on Monday | Sakshi
Sakshi News home page

ముదురుతున్న రాజకీయ సంక్షోభం

Published Fri, Jul 17 2020 5:44 PM | Last Updated on Fri, Jul 17 2020 7:49 PM

Sachin Pilot challenging disqualification notice heard on Monday - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో రాజుకున్న రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌తో పాటు 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 19 మంది రెబల్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులను కొట్టివేయాలంటూ పిటిషనర్ల తరఫు ప్రముఖ న్యాయవాదులు హరీష్‌సాల్వే, ముకుల్ రోహత్గి న్యాయస్థానాన్ని కోరారు. అసమ్మతి అంటే పార్టీ ఫిరాయించడంకాదని, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో నోటీసులు ఇవ్వడం సరైనదికాదని వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోనని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ చంద్రప్రకాశ్‌ ధర్మాసనానికి నివేదించారు. (రాజస్తాన్‌: ఆడియో టేపుల కలకలం)

కేంద్రమంత్రిపై కేసు నమోదు..
మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకూ అనేక ఉత్కంఠ పరిణామాలు చేసుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం తాజా మరో ఇద్దరు శాసన సభ్యులపై వేటు వేసింది. ప్రతిపక్ష బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పడేసేందుకు కుట్రలు పన్నారన్న ఆరోపణలతో భన్వర్‌లాల్‌, విశ్వేంద్ర సింగ్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆడియో టేపుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. దీనిపై అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆడియో టేపుల వివాదంపై పార్టీ నేతల ఫిర్యాదు మేరకు రాజస్తాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) కేసు నమోదు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్‌, సంజయ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్‌లపై కేసు నమోదైనట్లు ఎస్‌ఓజీ ప్రకటించింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా..
ఇదిలావుండగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుమిత్రాదేవి తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నేపా నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుమిత్రా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పైలట్‌పై వేటు వేసినందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement