శత్రుఘ్న సిన్హా (ఫైల్ ఫోటో)
ముంబై : సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తుండటంపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌కు పలువురు వ్యతిరేకంగా గళమెత్తుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ తప్పేమీ కాదని, అది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోందని ఆమె సమర్థించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని, పార్లమెంటులోనే ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. రాజకీయ, వినోద రంగాల్లో లైంగిక లబ్ధులు ఇచ్చిపుచ్చుకోవడం, డిమాండ్ చేయడం సాధారణమేనని అన్నారు.
‘సరోజ్ ఖాన్ కానీ, రేణుకా చౌదరికానీ తప్పు కాదు. లైంగిక లబ్ధులు డిమాండ్ చేయడం, ఇవ్వడం వినోద, రాజకీయ రంగాల్లో ఉన్నదే. ఇది పాత విధానం. కాలపరీక్ష నిలబడిన విధానం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పదు. నువ్వు నన్ను.. నేను నిన్ను సంతృప్తి పరచే విధానం. చాలాకాలం నుంచి ఇది జరుగుతూ వస్తున్నదే. ఇందులో అంత బాధపడాల్సింది ఏముంది’ అని ఆయన అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొరియోగ్రఫీ రంగంలో ఆమె చేసిన సేవలు నిరూపమానమైనవని, రేఖ, మాధూరీ దీక్షిత్, దివంగత శ్రీదేవి కెరీర్‌లోను మలచడంలో ఆమె పాత్ర మరువలేనిదని, తన రంగంలో ఆమె లెజెండ్ అని శత్రుఘ్న పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉనికి లేదని తాను అనడం లేదని ఆయన పేర్కొన్నారు.
‘సరోజ్, రేణుకా వ్యాఖ్యలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తాను. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా రాజీపడతారో నాకు తెలుసు. సరోజ్ కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు, వేదనలు ఎదుర్కొని ఉంటారు. ఇక రాజకీయాల్లో ఉన్నదానిని క్యాస్టింగ్ వోట్ కౌచ్ అనాలేమో.. ఎదగాలనుకుంటున్న యువతులు.. సీనియర్ నేతలకు లైంగిక లబ్ధులను ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. వారి అంగీకరిస్తూ ఉండొచ్చు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘అయితే ఈ సంస్కృతి సరైనదని నేను అనడం లేదు. అలాంటి రాజీ పడే పనులు నేను ఎన్నడూ చేయలేదు. కానీ చుట్టూ జరుగుతున్న దానిని చూడకుండా ఉండలేదం కదా. నిజాన్ని మాట్లాడినందుకు సరోజ్‌ను ఖండించకండి’ అని శత్రుఘ్న పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment