సచివాలయానికి రాని సీఎంను ఎక్కడా చూడలేదు  | Shivraj Singh Chauhan fires on KCR | Sakshi
Sakshi News home page

సచివాలయానికి రాని సీఎంను ఎక్కడా చూడలేదు 

Published Wed, Dec 5 2018 3:55 AM | Last Updated on Wed, Dec 5 2018 3:55 AM

Shivraj Singh Chauhan fires on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయానికి రాని సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేసీఆర్‌పై మండిపడ్డారు. కూటమి ఆవిర్భావానికి ముందే విఫలమైందని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమ న్నారు. విభజన తరువాత తెలంగాణ అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ తాజ్‌బంజారాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో   ప్రసంగించారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ చేపట్టిన సంక్షేమ పథకా లు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని తిరిగి గెలుపుతీరాలకు చేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు.. 
‘సీఎంగా నేను 13 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటికీ నేను నా కార్యాలయంలోనే పనులు చేసుకుంటా. కానీ ఇక్కడ సీఎం సచివాలయానికి రారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఇంటినే క్యాంప్‌ ఆఫీసు చేసుకున్న సర్కారు ఇదే. ఎన్నో ఆశలు, ఆశయాలతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సుదీర్ఘ పోరా టాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట ప్రభుత్వం అంచనాలు పెంచేసింది. సాగుభూమి పెరగలేదు, సాగు వ్యవస్థ మెరుగవలేదు, ఇంటింటికీ తాగునీరు రాలేదు.. రెవెన్యూ మిగులున్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చా రు. మౌలిక సదుపాయాల్లోనూ వెనకబడ్డారు. మొత్తం నిధులన్నీ నీళ్లలో కలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోశారని విమర్శించారు.

ఇక నియామకాల విషయానికి వస్తే, లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్‌ నీరుగార్చారు. దళిత సీఎం హామీ అటకెక్కించి ఆయనే సీఎం అయ్యారు. కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం లేదు. డబుల్‌ బెడ్రూం అంటూ ఊదరగొట్టి ఎన్నింటి ని నిర్మించి ఇచ్చారు? గొప్పలకు పోయి పేదలకు చిన్న ఇంటినీ దూరం చేశారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ విధానాల వల్ల బంగారంలాంటి అనేక అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. బీజేపీ పాలనలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల స్వరూపం మారిపోయింద’ని చౌహాన్‌ అన్నారు. కాంగ్రెస్‌ టీడీపీలది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన కూటమి అని, ఆవిర్భావానికి ముందే అది విఫలమైందన్నా రు. సమావేశంలో నేతలు జీవీఎల్‌ నరసింహారావు, దత్తాత్రేయ, కృష్ణసాగర్‌రావు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement