సాక్షి, సిరిసిల్ల/ కరీంనగర్/ హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు 12 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చొప్పదండి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. జగిత్యాల అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ పేరు ఖరారు చేయడం గమనార్హం. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు మాత్రం టీఆర్‌ఎస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించకుండా సీఎం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బోడిగె శోభపై టీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు చేయడంతోనే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదని తెలుస్తోంది. రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణకు మళ్లీ టికెట్ ఇవ్వడంతో టీఆర్‌ఎస్ అసమ్మతి వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి తీవ్రంగా ఉన్నా.. వేములవాడ నుంచి రమేష్ బాబుకు మళ్లీ టికెట్ ఇవ్వడం గమనార్హం.
మాట నిలుపుకున్న కేటీఆర్..
సీఎం కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు మాట నిలుపుకున్నారు. కేటీఆర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పోటీచేస్తారని, సిరిసిల్ల నుంచి పోటీ చేయరని జరిగిన ప్రచారాన్ని తిప్పికొడుతూ మొదటి జాబితాలోనే సిరిసిల్ల నుంచి కేటీఆర్ పేరు ఖరారు అయింది. సిరిసిల్ల ప్రజలు తిరస్కరించే దాకా అక్కడే పోటీ చేస్తానని పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పుడు మరోసారి సిరిసిల్లలో పోటీచేస్తూ.. మాట నిలుపుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఏడు శాఖలను నిర్వహిస్తూనే.. సిరిసిల్ల నియోజకవర్గం సమస్యలను పరిష్కరిస్తూ.. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి పనులను కేటీఆర్ చేశారు. సిరిసిల్ల పట్టణంతోపాటు నియోజకవర్గంలో తనదైన మార్క్‌ను కేటీఆర్ చూపించారు.
అసమ్మతికి షాక్ ఇచ్చిన ‘చెన్నమనేని’..
వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తన వ్యతిరేక అసమ్మతి వాదులకు షాక్ ఇస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌ను సాధించారు. మరోసారి ఎన్నికల బరిలో రమేశ్‌బాబు నిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ వర్గీయులు వేములవాడలో తుల ఉమకు టిక్కెట్ వస్తుందని భావిస్తూ.. ప్రచారం చేశారు. మరోవైపు ఏకంగా అసమ్మతి గళాన్ని వినిపించారు. వారందరికీ ఝలక్ ఇస్తూ.. మొదటి జాబితాలోనే రమేశ్‌బాబు టిక్కెట్ సాధించారు. తుల ఉమకు వర్గంగా భావిస్తున్న టీఆర్‌ఎస్ నేతలకు తాజా నిర్ణయం మింగుడుపడడం లేదు. మరోవైపు పౌరసత్వం వివాదం కోర్టు విచారణలో ఉండాగానే మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ ఖరారు కావడం విశేషం. అసమ్మతికి షాక్ ఇస్తూ.. వేములవాడలో మరోసారి రమేశ్‌బాబు తన పట్టును నిరూపించుకున్నారు.
మానకొండూరులో మరోఛాన్స్..
రసమయి బాలకిషన్‌కు మానకొండూరులో మరోఛాన్స్‌ను టీఆర్‌ఎస్ కల్పించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్ మానకొండూరు అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. మానకొండూరు రాజకీయాలపై క్షేత్రస్తాయిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనా రసమయి బాలకిషన్ మరోసారి టీఆర్‌ఎస్ టిక్కెట్‌ను సాధించడం విశేషం.
చొప్పదండిలో శోభకు షాక్..
చొప్పదండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు పార్టీ టిక్కెట్‌ను తొలిజాబితాలో ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుంది అని చర్చ సాగుతుంది. మొత్తంగా జిల్లాలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన రాజకీయ చర్చకు సీఎం కేసీఆర్ తెరలేపారు.
Comments
Please login to add a commentAdd a comment