‘పెద్దపల్లి మార్కు’ తీర్పు | The Singareni Labor Union is The Most Influential in The Peddapally Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

‘పెద్దపల్లి మార్కు’ తీర్పు

Published Sun, Mar 31 2019 8:08 AM | Last Updated on Sun, Mar 31 2019 8:08 AM

The Singareni Labor Union is The Most Influential in The Peddapally Lok Sabha Constituency - Sakshi

సాక్షి, పెద్దపల్లి : లోక్‌సభ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక వర్గం ప్రభావం ఎక్కువ. సింగరేణి కార్మికుల్లో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. కొత్త పార్టీలను ఆహ్వానిస్తూ పాత పార్టీలకు వీడ్కోలు పలుకుతూ తమ మార్కు తీర్పును తెలియచేస్తుంటారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పనిచేసిన పీడీఎఫ్, తెలంగాణ తొలిదశ పోరాటంలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసమితి, టీడీపీ, తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ పార్టీలను పెద్దపల్లి గద్దె మీద ఆసీనులను చేశారు కార్మికులు. రాష్ట్రవ్యాప్తంగా నడిచే పొలిటికల్‌ ట్రెండ్‌లు, వేవ్‌లకు భిన్నంగా ఇక్కడ తీర్పులు వెలువడుతుంటాయి. ఎప్పుడు ఎలాంటి తీర్పునిచ్చారో ఓసారి చూస్తే..

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం 1952 నుండి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ విలక్షణ తీర్పునే ఇచ్చింది. 1952, 1957లో కరీంనగర్‌ ద్విసభ్య లోక్‌సభగా ఉన్న సమయంలో పీడీఎఫ్‌ (పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌) అభ్యర్థులను గెలిపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు. ఆ రెండుసార్లు పీడీఎఫ్‌ అభ్యర్థి ఎంఆర్‌. కృష్ణ విజయం సాధించారు. హైదరాబాద్‌ బొల్లారానికి చెందిన కృష్ణ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, జైలు జీవితం అనుభవించారు.

తెలంగాణ విముక్తి అనంతరం పీడీఎఫ్‌ అభ్యర్థిగా ద్విసభ్య లోక్‌సభలో రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కృష్ణ పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్‌స్థానం నుంచి రెండుసార్లు వరుసగా (1962, 1967) విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరాటం ఊపందుకున్న వేళ 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌కు చెందిన తులసీరామ్‌ పోటీ చేశారు. ఉద్యమ ఊపులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ఎంఆర్‌.కృష్ణను తెలంగాణవాదులు గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకొని టీపీఎస్‌ అభ్యర్థి తులసీరామ్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో 1984లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో  పెద్దపల్లి ఓటర్లు గొట్టె భూపతి (టీడీపీ)ని గెలిపించారు.

1998, 1999లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణకుమారిని గెలిపించి, అప్పటి సిట్టింగ్‌ ఎంపీ వెంకటస్వామిని ఓడించారు. ఎంఆర్పీఎస్‌ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయం అది. మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా ఆమెకు కలిసొచ్చింది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటస్వామి తనయుడు వివేక్‌ చేతిలో 47 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, 2014 ఎన్నికల్లో 2 లక్షల 91వేల భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌కు పదవి కట్టబెట్టారు పెద్దపల్లి ఓటర్లు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారిని గుర్తిస్తూ తీర్పునిచ్చారు. 
   

హ్యాట్రిక్‌ ప్లస్‌.. కృష్ణ
పెద్దపల్లి లోక్‌సభ విజేతలు వరుస విజయాలను మూటగట్టుకున్నారు. ఎంఆర్‌. కృష్ణ.. కరీంనగర్, పెద్దపల్లి ద్విసభ్య లోక్‌సభగా ఉన్న సమయంలో పీడీఎఫ్‌ పార్టీ నుంచి 1952, 1957లలో గెలిచారు. కరీంనగర్‌ (ద్విసభ్య) నుంచి పెద్దపల్లి విడిపోయి పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆయన పెద్దపల్లి నుంచి 1962, 1967లలో మరో రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ ప్లస్‌వన్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.
   

డబుల్‌ హ్యాట్రిక్‌.. స్వామి
1989 నుంచి పెద్దపల్లి పార్లమెంట్‌ బరిలో తలపడిన వెంకటస్వామి 1989, 1991, 1996లో మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు. మధ్యలో విజయాలకు దూరమైన వెంకటస్వామి 2004లో సుగుణకుమారిపై గెలిచారు. అయితే వెంకటస్వామి అంతకు ముందే సిద్దిపేట నుంచి మూడుసార్లు గెలిచిన హ్యాట్రిక్‌ ఎంపీగా రికార్డు సాధించి ఉన్నారు. సిద్దిపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం పునర్విభజనలో మెదక్‌గా ఏర్పడడంతో వెంకటస్వామి పెద్దపల్లికి వచ్చారు. 
   

కార్మిక నాయకుడికి పట్టం
పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బెల్లంపల్లి సింగరేణి కార్మికుడు కోదాటి రాజమల్లు 1980లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కార్మికుల పక్షాన ఏఐటీయూసీలో కీలకపాత్ర పోషించిన కోదాటి రాజమల్లుది హైదరాబాద్‌. కానీ ఆయన చెన్నూరులో స్థిరపడ్డారు. చెన్నూరు అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారాయన. కార్మికులు రాజమల్లును కార్మికవర్గ నాయకునిగా, తమ ప్రతినిధిగా గుర్తించడంతో, వాళ్లే ఆయన వెన్నంటి ఉండి పార్లమెంట్‌కు పంపించారు.   

–  నరేంద్రచారి, పెద్దపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement