∙ఎస్సీ అభ్యర్థులు నలుగురు జనరల్ సీట్లలో గెలిచారు. బీసీలలో మున్నూరు కాపు వర్గం నుంచి ముగ్గురు, పద్మశాలి ఒకరు, గౌడ ఒకరు, యాదవ ఒకరు, ఇద్దరు ఇతరులు .
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వద్దనుకున్నా, కులం, మతం ప్రభావం ఎక్కువే. తెలుగు రాష్ట్రాలూ అందుకు అతీతం కాదు. అయితే ఏయే సామాజిక వర్గాలు రాజకీయంగా ఆధిపత్యం సాధించాయి? వాటిలో ఏవి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి? ఏ వర్గం మొదట రాజకీయంగా పట్టు కలిగి.. ఆపై కోల్పోయిందనే అంశాలు ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీటికి సంబంధించిన విశ్లేషణలకు సహజంగానే ప్రాధాన్యం ఉంటుంది. గత అరవై ఐదేళ్ల రాజకీయాలకు సంబంధించి సామాజిక వర్గాల వివరాల సేకరణ, విశ్లేషణ క్లిష్టమైనదే అయినా ఒక ప్రయత్నం.. ఎక్కడైనా ఆయా నేతల కులాల వివరాల్లో పొరపాట్లు దొర్లవచ్చు. అవి ఉద్దేశపూర్వకంగా కాదని గమనించగోరుతున్నాము. ముందుగా 1952 నాటి పరిస్థితులు అప్పటి రాజకీయాలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి విశ్లేషణ..
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉండేది. కర్ణాటక, మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న భద్రాచలం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో సాయుధ పోరాటం కారణంగా, తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. తర్వాత కమ్యూనిస్టులు పోరాట పంథా వీడి బయటకు వచ్చినా, నిషేధం కొనసాగింది. దాంతో కమ్యూనిస్టులు పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాలను లెక్కలోకి తీసుకుంటే 43 చోట్ల కాంగ్రెస్.. పీడీఎఫ్ 35 చోట్ల గెలుపొందాయి. సోషలిస్టులు 12 చోట్ల గెలుపొందారు. అప్పట్లో షెడ్యూల్ కులాల సమాఖ్య పేరుతో వివిధ రాష్ట్రాలలో అభ్యర్థులు నిలబడేవారు. వారు ముగ్గురు గెలిచారు.
అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అంటే ఒక నియోజకవర్గంలో జనరల్ అభ్యర్థి, మరొకరు షెడ్యూల్ కులాలు లేదా తెగల అభ్యర్థి ఉండేవారు. రిజర్వుడు అభ్యర్థికి కనుక జనరల్ అభ్యర్థికన్నా ఎక్కువ ఓట్లు వస్తే అతనినే విజేతగా ప్రకటించేవారు. అలా కొందరు, మరికొన్ని చోట్ల జనరల్ స్థానాలో ఎస్సీ నేతలు గెలుపొందిన చరిత్ర ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు రెండుచోట్లా పోటీచేసి గెలుపొందారు. తొలి ఎన్నికల్లో రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో అప్పట్లో బ్రాహ్మణుల హవా బాగా నడిచేది. తర్వాత కాలంలో వారి ప్రభ తగ్గుతూ వచ్చింది. కానీ రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఆ తర్వాత వెలమ వర్గం ప్రాధాన్యం పొందింది. సంఖ్య రీత్యా తక్కువే అయినా కరీంనగర్ జిల్లాలో వారి ప్రభావం కనిపిస్తుంది. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం 24 చోట్ల గెలిస్తే, బ్రాహ్మణులు 26 చోట్ల గెలిచారు. వెలమలు నాలుగు చోట్ల, ముస్లింలు, బీసీలు ఎనిమిది చొప్పున స్థానాల్లోనూ గెలిచారు.
తొలి ఎన్నికలో 24 మంది రెడ్లు..
తెలంగాణలో తొలి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా గట్టి పట్టుండేది. కాంగ్రెస్‌లో కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు ఉంటే, పీడీఎఫ్ (కమ్యూనిస్టులు)లో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి ప్రముఖులు ఉండేవారు. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది గెలిస్తే, పీడీఎఫ్ నుంచి పది మంది విజయం సాధించారు.ప్రస్తుత రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం అప్పటి నుంచే ఉన్నట్లు ఈ ఫలితాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ఇంకా సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గీయులు నాటి ఎన్నికల్లో గెలుపొందారు.
బ్రాహ్మణులు 26 మంది..
తెలంగాణలో స్వాతంత్య్రోద్యమ సమయం నుంచే బ్రాహ్మణులు గట్టి పాత్ర పోషించారని చెప్పాలి. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, పి.హనుమంతరావు, ముందుముల నరసింగరావు, గోపాలరావు ఎక్బోటే వంటి ప్రముఖులది రాజకీయాల్లో కీలకపాత్ర. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి 14 మంది బ్రాహ్మణులు ఎన్నికైతే, పీడీఎఫ్ నుంచి 11 మంది, సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు ఈ సామాజిక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
వెలమలు: ప్రభావం ఎక్కువే
సంఖ్యాపరంగా తక్కువైనా.. వెలమ సామాజిక వర్గానికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల గెలుపోటములను వారు నిర్దేశించే స్థాయిలో ఉంటారు. 1952 ఎన్నికల నుంచీ ఇది కొనసాగుతోంది. 1952లో నలుగురు వెలమ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో ఇద్దరు పీడీఎఫ్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా మరొకరు గెలుపొందారు.
ముస్లింలు ఎనిమిది మంది..
హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంటుంది. నిజాం రాజ్యంలో వారికి ఎనలేని ప్రాముఖ్యత ఉండేది. స్వాతంత్య్రానంతరం పరిస్థితులు మారాయి. అయినా తెలంగాణ ప్రాంతం నుంచి ముస్లింలు గణనీయ సంఖ్యలోనే గెలుస్తుంటారు. 1952లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది ముస్లింలు గెలిచారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. మతపరమైన విభజనతో ఓట్లు వేయడం కూడా అప్పట్లో తక్కువే అని చెప్పాలి. మొత్తంగా ఎనిమిది మంది ముస్లింలు తొలి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వీరిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఒకరు ఇండిపెండెంట్. ఈ ఎన్నికల్లోనే మాసూనా బేగం, నవాబ్ జంగ్ వంటి ప్రముఖులు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు.
బీసీ వర్గాల నుంచి 8 మంది..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అన్ని సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెద్దగా ఉండేది కాదు. ప్రత్యేకించి బీసీ వర్గాలలో సంఖ్యాపరంగా ప్రజలు ఎక్కువగానే ఉన్నా, వారి నుంచి అసెంబ్లీకి ఆ నిష్పత్తిలో ఎన్నికవడం తక్కువగానే ఉండేది. దీనికి కారణం బీసీలలో అనేక సామాజిక వర్గాలు ఉండటమే. పైగా వారు సంఘటితం కావడం కూడా తక్కువగానే ఉండేది. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, సంగం లక్ష్మీబాయి, జి.రాజారాం వంటి ప్రముఖులు రాజకీయాల్లో రాణించి వన్నె తెచ్చారు. మొత్తం ఎనిమిది మంది బీసీలు ఎన్నిక కాగా ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఇద్దరు సోషలిస్టు పార్టీల నుంచి, మరొకరు ఇండిపెండెంటుగా గెలిచారు. వీరిలో మున్నూరు కాపులు ముగ్గురు, పద్మశాలి, యాదవ, గౌడ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఎస్సీలు 24 మంది..
తెలంగాణ ప్రాంతంలోని వివిధ ద్విసభ్య, జనరల్ నియోజకవర్గాల నుంచి 24 మంది షెడ్యూల్ కులాల నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 9, పీడీఎఫ్ నుంచి ఏడుగురు, సోషలిస్టు పార్టీ నుంచి నలుగురు, షెడ్యూల్ కులాల సమాఖ్య నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు నెగ్గారు. అరిగే రామస్వామి, జేబీ ముత్యాలరావు వంటి ప్రముఖులు కాంగ్రెస్ నుంచి, ఉప్పల మల్సూర్ పీడీఎఫ్, కోదాటి రాజమల్లు సోషలిస్టు పార్టీ నుంచి గెలుపొందారు. పెద్దపల్లి, ఖమ్మం, మంథనిల నుంచి జనరల్ సీట్లలో ఎస్సీ అభ్యర్థులు గెలిచారు. గిరిజనులు ఇద్దరు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment