దీక్షా వేదికపై మాట్లాడుతున్న సురవరం
సాక్షి, న్యూఢిల్లీ: నియంతృత్వ పోకడలతో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రధాని మోదీది అహంకారపూరిత ధోరణి అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బుధవారం సురవరంతోపాటు ఆయన సతీమణి విజయలక్ష్మి సంఘీభావం తెలిపారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు.
హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. హోదా సాధన కోసం ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం అభినందనీయమన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. టీడీపీ కూడా మొదట వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిందన్నారు. అయితే అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపకుండా కేంద్రం పారిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రధాని సమాధానం చెప్పాలి..
అవిశ్వాసం సహా ఇతర అంశాలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలే సభను అడ్డుకున్నాయని చెబుతూ ప్రధాని మోదీ దీక్షకు దిగనుండడం దేనికి సంకేతమని సురవరం ప్రశ్నించారు. ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రం వైఖరికి నిరసనగా పదవులకు రాజీనామాలు చేసి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ప్రధాని స్పందించరా అని నిలదీశారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీలు దీక్షకు దిగి ఐసీయూలో చేరితే కనీసం కేంద్ర మంత్రులైనా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని, ఇది రాజకీయ ప్రకటన కాదని.. పార్లమెంటులో ప్రధాని చేసింది ప్రభుత్వ ప్రకటన అని, దాన్ని అమలు చేయాలన్నారు. ఏపీకి హోదా విషయంలో రాష్ట్రం ఒకవైపు ఉంటే.. బీజేపీ మరో వైపుందన్నారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హోదా కోరుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment