రింబోలా.. రింబోలా! | TDP Activists And Leaders Involved In Vijayawada Mujra Party Case | Sakshi
Sakshi News home page

రింబోలా.. రింబోలా!

Published Fri, Jul 20 2018 12:10 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

TDP Activists And Leaders Involved In Vijayawada Mujra Party Case - Sakshi

సీఎం చంద్రబాబుకు బొకే ఇస్తున్న నిందితుడు రామకృష్ణ (ఫైల్‌) ,టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాతో నిందితుడు కొల్లూరి రామకృష్ణ (ఫైల్‌)

సాక్షి, అమరావతిబ్యూరో: నిన్న కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ బాగోతం. నేడు ముజ్రా పార్టీలతో అశ్లీల సంస్కృతి. టీడీపీ నేతల అండతో వెర్రితలలు వేస్తున్న విశృంఖలత్వం. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన హోటలే అడ్డా. ఆయన అనుచరగణమే నిర్వాహకులు. ఇదీ రాజధాని విజయవాడలో తాజా పరిస్థితి. ఒకప్పుడు కళా సాంస్కృతిక రాజధానిగా భాసిల్లిన విజయవాడను విచ్చలవిడి విషసంస్కృతికి అడ్డాగా మార్చేస్తున్నారు. తాజాగా పోలీసుల మెరుపుదాడిలో ముజ్రా రాకెట్‌ బాగోతం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే విజ యవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో చెలరేగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరగణం అంతటితో తగ్గలేదు. ముజ్రా రాకెట్‌కు విజయవాడను అడ్డాగా మలిచి విచ్చలవిడి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నట్లు వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. పక్కా సమాచారంతో జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 40 మంది కానిస్టేబుళ్లతో బుధవారం అర్ధరాత్రి భవానీపురంలోని ఆలివ్‌ ట్రీ హోటల్‌పై మెరుపుదాడి చేయడంతో ముజ్రా రాకెట్‌ బండారం బట్టబయలైంది.

ముగ్గురు నిర్వాహకులతోపాటు 50 మంది విటులు, ఐదుగురు యువతులను అరెస్టు చేశారు. రూ.4లక్షలతోపాటు ఆడియో సిస్టమ్, మద్యం బాటిళ్లు, కండోమ్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల మెరుపుదాడితో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్, భీమవరంతోపాటువివిధ ప్రాంతాల నుంచి యువతులను తెప్పిస్తున్నారు. ప్రతి నెలా మూడో బుధవారం ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఒక్కో ముజ్రా పార్టీకి 30 నుంచి 100 మంది వరకు ఎంపిక చేసిన వారికే అవకాశం కల్పిస్తున్నారు.  ప్రవేశరుసుమే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. లోపలికి ప్రవేశించిన తరువాత మద్యం, గంజాయి, ఇతర కార్యకలాపాలకు అదనంగా వేలకు వేల రూపాయలు లాగేస్తున్నారు. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్‌తో చెవులు చిల్లులుపడేలా సంగీతం, అశ్లీల నృత్యాలతో విచ్చలవిడిగా చెలరేగుతున్నారు. జూదం సంగతిసరేసరి. ఇలా ఒక రోజు ముజ్రా పార్టీపేరుతోనే కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ దందాతో భారీగా సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు ముజ్రా రాకెట్‌ను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. విజ యవాడతో పాటు సమీప ప్రాంతాలు, పొరుగు జిల్లాల్లో కూడా ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు.

అందరూ టీడీపీ తానులో ముక్కలే...
టీడీపీ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరులే సర్వం తామై ముజ్రా రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. నగరానికి చెందిన వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఆ హోటల్‌ను తన బినామీ పేరుతో ఏడాది కిందట కొనుగోలు చేయడం గమనార్హం. ఆయన ఆ హోటల్‌ను తన ప్రధాన అనుచరుడుకు లీజుకుఇచ్చారు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధి ప్రధాన అనుచరులు ముగ్గురు ఆ హోటల్‌ కేంద్రంగా ముజ్రా రాకెట్‌ నిర్వహిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరులే ఎక్కువమంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ 47వ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి రామకృష్ణ, సామ చైతన్యతోపాటు 15 మంది వరకు ప్రజాప్రతినిధి కోటరీలోని సభ్యులే ఉన్నారు. ముజ్రా రాకెట్‌ అంతా టీడీపీ ప్రజాప్రతి నిధి వర్గీయుల అండతోనే సాగుతోందని తేటతెల్లమైంది.

ఇకపోలీసుల దాడి తరువాత ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. ఈ కేసు నుంచి తమ సన్నిహితులను తప్పించేందుకు, వీలు కాకపోతే నామమాత్రపు సెక్షన్లతో కేసును నీరుగార్చేందుకు ఒత్తిడి తీసుకువచ్చారు. జిల్లా కీలక నేతతో కూడా ఫోన్లు చేయించి రాజకీయంగా ఒత్తిడి పెంచారు. ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఒకరు స్వయంగా పోలీస్‌ స్టేషన్లకు తిరుగుతూ అధికారులతో ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. ఈ కేసులో అరెస్టు చేసిన ముజ్రా పార్టీ నిర్వాహకులు, విటులు, యువతులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు. విజయవాడలో వ్యాపిస్తున్న విష సంస్కృతి కట్టడికి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఉంది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా వరుస దాడులు చేస్తే తప్ప విజయవాడను సురక్షిత రాజధానిగా తీర్చిదిద్దలేరన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ముజ్రా పార్టీలను అడ్డుకుంటాం
ఆలివ్‌ ట్రీ హోటల్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి 53 మందిని అరెస్టు చేశాం. హోటల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. ముజ్రా పార్టీల్లో అశ్లీల నృత్యాలు, కొంత సమయం దాటిన తరువాత మరింత విచ్చలవిడి తనంతో చెలరేగిపోయే విష సంస్కృతి ఉంటుంది. రూ.4లక్షల నగదుతో పాటు ఆడియో సిస్టమ్, మద్యం బాటిళ్లు,  తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం.– క్రాంతి రాణాటాటా, జాయింట్‌ సీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement