బల్లగిరి శీనయ్య ప్రచురించిన కరపత్రాలు బల్లగిరి శీనయ్య
దర్శి: మంత్రి శిద్దా రాఘవరావు దర్శి నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, అలాంటి నాయకులు మనకు అవసరమా..? అని టీడీపీ దర్శి మండల మాజీ కన్వీనర్, బీసీ నాయకుడు బల్లగిరి శీనయ్య కరపత్రాలు ముద్రించారు. నియోజకవర్గ ప్రజలు దీనిపై ఆలోచించాలని కోరారు. ఆ కరపత్రాలు ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలోని పలు దుకాణాలు, సెంటర్లలో కూడా దర్శనమిస్తున్నాయి.
ఆ కరపత్రాల్లో ఏముందంటే...
‘పార్టీ అధికారంలో లేనప్పుడు నిస్వార్థంతో పనిచేసి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మంత్రి మరిచిపోయారు. టీడీపీని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులను అమ్ముకుని రేయనక పగలనక, ఎండనక వాననక కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించారు. పార్టీ గెలిచిన తరువాత వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. బీసీలంటే ప్రాణం, బీసీలే పార్టీకి వెన్నుముక అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే.. దర్శి నియోజకవర్గంలో మంత్రి బీసీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వప్రయోజనాల కోసం ఎప్పటి నుంచో ఒకే తాటిపై కలిసి మెలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తే ఇంకో నియోజకవర్గం చూసుకుంటానని, పార్టీ ఫండ్ ఇచ్చి ఎంఎల్‌సీ తీసుకుంటానని తనమనుషులతో చెప్పిస్తున్నారు. గతంలో ఈ నియోజక వర్గంలో ఓడిన వారు అడ్రస్ లేకుండా పోతున్నారని, గెలిచిన వారు చేసిన ఖర్చులు సంపాదించుకోవద్దా అని అనడమే తప్ప అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.
దొనకొండ పారిశ్రామిక హబ్ అని పేదల పొలాలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దల నివాసాల వద్ద డ్రైనేజీలను వంకర్లు తిప్పి నిర్మించారు. నామినేటెడ్ పదవుల ఆశ చూపి ఖర్చులు చేయించి చివరకు వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు చూపి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులు, తదితర హామీలిచ్చి అమలు చేయలేదు. వీటన్నింటిపై విద్యావంతులు, అనుభవం కలిగిన పెద్దలు, యువకులు, ఉద్యోగులు. మేధావులు ప్రతిఒక్కరూ ఆలోచించాలి’ అని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై బల్లగిరి శీనయ్యను ప్రశ్నించగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ కరపత్రాలను తానే ముద్రించానని చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి అతని సామాజికవర్గం వారిని తప్ప ఇతర సామాజికవర్గాల వారిని పట్టించు కోవడం లేదని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారిని దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment