గురువారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: అంచనాలను నిజం చేస్తూ టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. ఈమేరకు నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖను ఇవ్వడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందుకు అంగీకారం తెలిపారు. అనంతరం టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి అందజేశారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ సమయంలో వారి వెంట ఉన్నారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి అందజేశారు. అనంతరం వారు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. బీజేపీలో విలీనం లేఖపై సంతకం చేసిన నలుగురు టీడీపీ ఎంపీల్లో ఒకరైన గరికపాటి మోహన్‌రావు అస్వస్థతకు గురికావడంతో ఉప రాష్ట్రపతి నివాసానికి, బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాలేదు.
జేపీ నడ్డా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు ఎంపీలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. తొలుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, దీనిద్వారా ప్రభావితమై టీడీపీ రాజ్యసభా పక్షానికి చెందిన నలుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ ‘చాలాకాలంగా వైఎస్ చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, మోహన్‌రావుల మనసులో ఈ ఆలోచన ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వృద్ధిపథంలో నడుస్తుండడం, అమిత్‌షా సంస్థాగత నిర్వహణ సామర్థ్యాలను చూసి ప్రభావితులై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీరంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ చౌదరి నేతృత్వంలో టీడీపీ పక్షం సమావేశమై బీజేపీలో విలీనం కావాలని తీర్మానించారు. ఇప్పుడు వారు బీజేపీ సభ్యులు. బీజేపీ సానుకూల రాజకీయాలను నమ్ముతుంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్‌ను విశ్వసిస్తుంది. తద్వారా మేం ముందుకు సాగుతాం. ఈ నలుగురు నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేస్తారని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలనే: సుజనా
‘సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం ఆలోచన ఏమిటన్నది మీ అందరికీ తెలుసు. మేం జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఎన్డీఏ ప్రభుత్వంలో మూడున్నరేళ్లపాటు మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలు సాధ్యమైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం బీజేపీలో చేరుతున్నాం’ అని సుజనా చౌదరి పేర్కొన్నారు.
ఉదయమే ముహూర్తం
గురువారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం రాజ్యసభ సమావేశమై వాయిదాపడింది. ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ వెళుతున్న సందర్భంలో వైఎస్ చౌదరి అధికారపక్షం వైపు వెళ్లి జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులను పలకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అక్కడే ఉన్నారు. విలీన ప్రక్రియను ఈరోజే పూర్తి చేయాలని ఆయన వైఎస్ చౌదరికి సూచించినట్టు సమాచారం. అనంతరం నలుగురు టీడీపీ సభ్యులు రాజ్యసభ చైర్మన్ చాంబర్‌లోకి వెళ్లి సభలోకి వస్తూ మెట్లు దిగుతుండగా గరికపాటి మోహన్‌రావు పట్టుతప్పి కిందపడ్డారు. ఆయన కాలు బెణకడంతోపాటు బీపీ పెరగడంతో వైద్య పరీక్షల అనంతరం రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత టీడీపీ రాజ్యసభా పక్ష సమావేశం నిర్వహించి విలీనంపై తీర్మానం చేశారు. విలీన పత్రంపై గరికపాటి మోహన్‌రావు కూడా సంతకం చేశారు.
విలీనం లేఖ ఇలా..
‘రాజ్యసభలో తెలుగుదేశం పక్షం ఈరోజు పక్ష నేత వైఎస్ చౌదరి, ఉప నేత సీఎం రమేశ్‌ల నాయకత్వంలో సమావేశమైంది. నరేంద్రమోదీ నాయకత్వం, అభివృద్ధి విధానాల నుంచి స్ఫూర్తి, ప్రోత్సాహం పొంది జాతి శ్రేయస్సు దృష్ట్యా మేం రాజ్యాంగం పదో షెడ్యూలులోని పేరా 4 పరిధిలో బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించాం. సంప్రదింపుల అనంతరం ఈ కింది తీర్మానం చేశాం. 1. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని తక్షణం పదో షెడ్యూలు ప్రకారం బీజేపీలో విలీనం చేయాలి. 2. విలీనాన్ని ఆమోదించాలని బీజేపీ అధ్యక్షుడికి లేఖ రాయాలి. ఆయన సమ్మతిని ఒక తీర్మానం ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌కు తెలియపరచాలని కోరాలి. 3. విలీనాన్ని పదో షెడ్యూలు ప్రకారం ఆమోదించాలని, మమ్మల్ని బీజేపీ పక్షంలో భాగస్వాములుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయాలి..’ అని తీర్మానిస్తూ నలుగురు ఎంపీలు సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment