అమిత్‌ షాపై దాడి | TDP Workers Pelted Stones On Amit Shah Convoy, Slogans Go Back | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై దాడి

Published Sat, May 12 2018 1:16 AM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

TDP Workers Pelted Stones On Amit Shah Convoy, Slogans Go Back - Sakshi

దాడికి యత్నిస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు.. (ఇన్‌సెట్‌లో) దాడిలో ధ్వంసమైన కారు అద్దాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతికి కొండ దిగుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అరుపులు, కేకలు, తోపులాటలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమిత్‌ షా కారును అడ్డుకోబోయిన ఆందోళనకారుల యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశరెడ్డి ధ్వజమెత్తగా.. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నిరసన పేరుతో దాడి చేయడాన్ని వివిధ వర్గాల ప్రముఖులు త్రీవంగా ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అమిత్‌ షా.. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి తిరుపతికి ప్రయాణమయ్యారు.

అమిత్‌ షా రాక గురించి తెలుసుకున్న టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడు  దంపూరు భాస్కర్‌ యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, స్థానిక ఎమ్మెల్యే అల్లుడు బీఎల్‌ సంజయ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుణశేఖర్‌ నాయుడు తదితరులు పార్టీ కార్యకర్తలతో ఉదయం 11గంటలకు పెద్దఎత్తున అలిపిరి గరుడ సర్కిల్‌కు చేరుకున్నారు. అమిత్‌ షా కాన్వాయ్‌ రాగానే ‘గో బ్యాక్‌..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆయన క్వానాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అమిత్‌ షా కారు గరుడ సర్కిల్‌ దాటి వెళ్లిపోయింది.

అలిపిరి వద్ద అమిత్‌షా కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను అదుపుచేస్తున్న పోలీసులు

కాన్వాయ్‌లోని ఓ కారును చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.. కారు వెనుక అద్దాలపై కట్టెలు, రాళ్లతో దాడిచేసి పగులగొట్టారు. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అడ్డుపడ్డారు. బీజేపీ నాయకులను వెళ్లమని చెప్పి టీడీపీ ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా స్వల్పంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులను రోప్‌ పార్టీ బలంగా వెనక్కి నెట్టడంతో సింగంశెట్టి సుబ్బరామయ్య, గుణశేఖర్‌నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సుబ్బు, రవి, ఆనంద్‌గౌడ్‌లనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేసి అలిపిరి స్టేషన్‌కు తరలించారు.

ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు
ఈ సంఘటన జరిగిన గంట తరువాత తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, చంద్రారెడ్డి, వరప్రసాద్, కోలా ఆనంద్‌లు ఎస్పీ అభిషేక్‌ మొహంతిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు కూడా ఎస్పీని కలిసి తమ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడిచేశారని ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల కేసులూ నమోదు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ముఖ్యమంత్రిదే బాధ్యత
రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోంది. అమిత్‌ షా కాన్వాయ్‌పై జరిగిన దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. సీఎం ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. రౌడీలు, గూండాల్లా వ్యవహరించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటే సరిపోదు.. తాడిచెట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. తులసి మొక్కకున్న పవిత్రత దానికి ఉండదు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన జాతీయ పార్టీ నేతను అవమానించడం, తెలుగు ప్రజలపై ఉన్న మంచి అభిప్రాయాన్ని దెబ్బతీయడమే. ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలి.
– భానుప్రకాశ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement