తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటమి పాలైన పార్టీలు కూటమిగా ఏర్పడటం వల్ల ఒరిగేదేమి లేదన్నారు. జూన్ నుంచి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్నిసిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని, పార్టీ అనుమతి వచ్చిన తరువాత ప్రారంభిస్తామన్నారు. కోదండరాం కు, తెలంగాణ జనసమితి పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉందని, ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడితే ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ జన సమితి కాంగ్రెస్‌తో వెళ్తే కోదండరాం పుట్టి మునిగినట్టేన్నారు. టీఆర్‌ఎస్‌పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం సభ్యులను సస్పెండ్ చేసి, ఇద్దరి సభ్యుల సభ్యత్వం రద్దు చేసినా కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
మరోవైపు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన అంశంపై లక్ష్మణ్ స్పందించారు. నాగం జనార్థన్‌రెడ్డికి ఏం తక్కువ చేయలేదని, ఆయన కొడుకుకు నాగర్‌కర్నూల్ టికెట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. అక్కడ మర్రి జనార్థన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు నాగర్ కర్నూల్‌ను గెలిచేవాళ్లమన్నారు. నాగం.. కొడుకు అసమర్థతను పక్కన పెట్టి, పార్టీపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల పదవులు త్యాగం చేసి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చిన ఘనత తమదని పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం
ఏపీ వ్యవహారాల ఇంచార్జీ రాంమాధవ్ ప్రభావం దక్షణాది అంతటా ఉంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యవేక్షణ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చిందని, మరో రెండు రోజుల్లో ఈ అంశం తేలిపోతుందన్నారు. కర్టాటక ఎన్నికల నేపథ్యంలో తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్టాటకలో బీజేపీ గెలుపు తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment