
సాక్షి, ఢిల్లీ: బీజేపీ తెలంగాణలో పట్టు బిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుపొంది.. అందరినీ ఆశ్చర్యపరిచిన కమలం పార్టీ.. తాజాగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు.
టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనారిటీ నేత షేక్ రహమతుల్లా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నాయకులకు కమలం కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.