
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, వాటిని ఏ మేరకు ఖర్చు పెట్టారనే దానిపై లెక్కలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. నిధుల వివరాలతో ఈ నెల 15లోగా శ్వేతపత్రం విడుదల చేయాలని గడువు విధించారు. లేకపోతే భవిష్యత్ కార్యాచ రణ గురించి ఆలోచిస్తానని వెల్లడించారు.
ఆదివారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ వాళ్లు చెబుతున్న వాటిపై తాను గందరగో ళంలో ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా హామీ నెరవేరలేదనే అసంతృప్తి తనకూ ఉందన్నారు. ఉండవల్లి, జేపీ వంటి మేధావులతో ఏర్పడే నిజనిర్ధారణ కమిటీ వాటిపై అధ్యయనం చేసి అబద్ధాల లెక్క తేలుస్తుందని చెప్పారు.