సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సీటు విషయంలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నటివరకు కేవలం టీజీ భరత్, ఎస్వీ మోహన్‌రెడ్టిలకే పరిమితమైంది. తాజాగా టీజీ వెంకటేష్ కూడా రంగంలోకి దిగారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదులే అని టీజీ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పత్తికొండలో పోటీ చేస్తానంటే కేఈ వాళ్లు తుంగభద్రలో పడేస్తారని, ఆళ్లగడ్డలో పోటీకి దిగితే కుటుంబ సభ్యులు ఇంట్లోకి కూడా రానివ్వరని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కర్నూలును వదిలిపెట్టిపోనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో నిర్వహించిన జన్మభూమి సభలో పాల్గొన్న సందర్భంగా గురువారం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాస్తవానికి కొంతకాలంగా కర్నూలు సీటు విషయంలో అధికార పార్టీలో టీజీ భరత్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య రచ్చ జరుగుతోంది. కర్నూలు నుంచి తాను పోటీ చేస్తానని టీజీ భరత్ అంటుండగా... సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు తనదేనని ఎస్వీ చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందంటూ టీజీ వాతావరణాన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం చేసినప్పటికీ.. కుటుంబంలో ముగ్గురికి ఎలా సీట్లు ఇస్తారనే కొత్త వాదనను మాత్రం తెరమీదకు తెచ్చారు.
ఒకే వాహనంలో తిరుగుతూనే..
కర్నూలులోని ఎన్‌ఆర్ పేట నుంచి ఎస్.నాగప్ప స్ట్రీట్ వరకూ గురువారం జన్మభూమి సభలు జరిగాయి. ఈ సందర్భంగా టీజీ, ఎస్వీ ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి తిరిగారు. వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఒకే వాహనంలో తిరుగుతున్నప్పటికీ కర్నూలు సీటు విషయానికి వచ్చేసరికి ఎవరికివారుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. పైగా ఇప్పటివరకు టీజీ భరత్, ఎస్వీకే పరిమితమైన మాటల యుద్ధం.. తాజాగా టీజీ వెంకటేష్, ఎస్వీ మధ్య మారినట్టు అర్థమవుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సీట్లకు ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అయితే, స్వయంగా టీజీ వెంకటేష్ రాజ్యసభలో వేసిన ప్రశ్నకు నియోజకవర్గాల పునర్విభజన లేదంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ మాట వరుసకే ఆయన ఇలా అన్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment