ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌తో కరచాలనం చేస్తున్న మంత్రి సబితారెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాండూరు ఆడపడచు, సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ముచ్చటగా మూడోసారి అమాత్యపదవిని దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో సబితకు చోటు లభించింది. మూడోసారి మహిళా మంత్రిగా పదవిని అలంకరించిన ఆమె ఇప్పటికే తనదైన ముద్రవేశారు. సీఎం కేసీఆర్ సబితకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు దూరమై అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఆమె స్వల్పకాలంలోనే ప్రభుత్వంలో కీలక పదవిని దక్కించుకోవడం విశేషం. గతంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సబితమ్మకు తాజాగా మరోసారి ఆ యోగం లభించింది. జిల్లాకు చెందిన పలువులు ఆయా పార్టీల నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ... మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసే అవకాశం కొందరికే లభించింది. ఈ జాబితాలో చేవెళ్ల చెల్లమ్మ ఒకరు.
మలుపు తిప్పిన నిర్ణయం..
టీఆర్‌ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్‌ను శాసిస్తున్నారని, పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చిందని సబితా ఇంద్రారెడ్డి మనస్తాపం చెందారు. మరోపక్క పార్టీలో తనకు రోజురోజుకూ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్‌ను తన కుమారుడు కార్తీక్‌రెడ్డి ఆశించగా అది సాధ్యపడలేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఆమెను దూరం చేయగా.. టీఆర్‌ఎస్‌కు చేరువ చేశాయి. ఈ క్రమంలో సబిత తన కుటుంబంతో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు భరోసా, సబితకు భవిష్యత్‌లో మంత్రి పదవిగా అవకాశం కల్పిచేందుకు హామీ ఇచ్చినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమవగా ఆ పార్టీలోని ఎమ్మెల్యేల్లో సబిత ఒకరు. ఇలా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆరు నెలల్లోపే ఆమెకు అమాత్యయోగం లభించింది.
అభివృద్ధికి అవకాశం
మంత్రివర్గ విస్తరణలో సబిత రూపంలో మరోసారి ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం దక్కడం శుభపరిణామం. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2004లో తొలిసారిగా వైఎస్సార్ హయాంలో సబిత గనులశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాగానే హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. రెండు దఫాలుగా విజయవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే సబితమ్మకు మరోసారి పదవి రావడం పట్ల జిల్లా నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
సస్యశ్యామలం చేస్తా
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు సస్యశ్యామలం చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ నమ్మకంతో నాకిచ్చిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తా. మంత్రిగా అవకాశమిచ్చిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా పనిచేసేందుకు అవకాశం రావడం నా అదృష్టం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాం. కృష్ణానీటితో జిల్లాలోని పంటపొలాలను పారించి అన్నదాతలకు మేలు చేస్తా. విద్యాశాఖను పటిష్టం చేయడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తా. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్యను అందజేసేలా చర్యలు తీసుకుంటా’నని పేర్కొన్నారు.
ప్రొఫైల్
పేరు: పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
భర్త: పట్లోళ్ల ఇంద్రారెడ్డి
సంతానం: ముగ్గురు కుమారులు
పుట్టిన తేదీ: 05–05–1963
చదువు: బీఎస్సీ
గతంలో నిర్వహించిన పదవులు: గనులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు.
చేవెళ్ల నుంచి ప్రస్థానం
చేవెళ్ల/మహేశ్వరం: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చేవెళ్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి భార్యాభర్తలు పట్లోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వీరిది చేవెళ్ల మండలం కౌకుంట్ల స్వగ్రామం. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1980లో రాజకీయాల్లోకి వచ్చారు. కౌకుంట్ల సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1984లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అనంతరం 1985లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. వరుసగా 1989, 1994, 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్ మంత్రి వర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోవటం తదితరాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టారు. దీంతో ఇంద్రారెడ్డి సైతం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంద్రారెడ్డి కార్మిక, ఉపాధిశాఖ మంత్రిగా, హోంశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నాలుగుసార్లు గెలిచిన సబితారెడ్డి
ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన రాజకీయ వారసురాలిగా సబితారెడ్డి కొన్నిరోజుల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి అఖండ విజయం సాధించారు. ఆ తరువాత 2004లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ మంత్రి వర్గంలో మొదటిసారిగా భూగర్భ గనుల, జలవనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో (డీ లిమిటేషన్) చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో ఆమె నియోజకవర్గం మారాల్సి వచ్చింది.
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సూచన మేరకు జిల్లాలోని మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ రాష్ట్ర హోంమంత్రిగా కీలకమైన పదవిని కట్టబెట్టారు. దీంతో ఆమె రాష్ట్రంతోపాటు దేశ చరిత్రలో మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా భార్యాభర్తలు పి.ఇంద్రారెడ్డి, సబితారెడ్డి హోంమంత్రులుగా పదవిని అలంకరించి సరికొత్త చరిత్ర లిఖించారు. వైఎస్సార్ అప్పట్లో ప్రతి సంక్షేమ పథకాన్ని చేవెళ్ల నుంచి ప్రారంభించారు. చేవెళ్లను ఆయన సెంటిమెంట్‌గా భావించారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశారు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె మిన్నకుండిపోయారు. 2018లో మళ్లీ మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన విజయం సాధించారు. ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆమెకు విద్యాశాఖ అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment