గచ్చిబౌలి (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ముందుకు రావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్‌లోని కేశవ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు చేయూతతో పునర్నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌లో తపన, ఆరాటం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లో, ఆయన తనయుడు హిమాన్షులోను సామాజిక బాధ్యత ఉందన్నారు. తాత నుంచి వచ్చిన సామాజిక దృక్పథం వల్లే హిమాన్షు పేద పిల్లలు చదివే పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
యువత పుట్టినరోజును ఎలా ఎంజాయ్ చేయాలా అని చూస్తారని, హిమాన్షు మాత్రం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. హిమాన్షు సూచనల మేరకు కేశవ్‌నగర్ పాఠశాలకు అవసరమైన టీచర్లను నియమిస్తామన్నారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, హిమాన్షు సామాజిక బాధ్యత చూస్తుంటే.. మీరేం చేస్తారని మౌనంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉందన్నారు. నియోజకవర్గంలోని 62 పాఠశాలలను దత్తతకు తీసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.
కేసీఆర్ నాకు స్ఫూర్తి: హిమాన్షు
‘చదువుకున్న వారు సమాజాన్ని, సమస్యలను అర్థం చేసుకుంటారు... పేదరికాన్ని అరికట్టేందుకు కృషి చేస్తారని మా తాత కేసీఆర్ ఇంగ్లిష్‌లో పెద్ద కొటేషన్ చెప్పారు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది’ అని కేసీఆర్ మనవడు హిమాన్షురావు పేర్కొన్నారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కాస్ (క్రియేటివ్ యాక్షన్ సర్వీస్) ప్రెసిడెంట్‌గా మొక్కలు నాటడం తనకు సంతృప్తి ఇవ్వలేదని, కేశవ్‌నగర్ పాఠశాలలో దుర్భర పరిస్థితులను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు.
ఆడపిల్లల టాయిలెట్ ముందు పందుల గుంపు ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఓక్రిడ్జ్ కాస్ ఆధ్వర్యంలో రెండు పెద్ద ఈవెంట్లు నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్యం అనుమతివ్వడంతో రూ.40 లక్షల నిధులు సమకూర్చామని, సీఎస్‌ఆర్, స్నేహితుల ద్వారా సేకరించిన నిధులతో కేశవ్‌నగర్ పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దామని హిమాన్షు వివరించారు.
పాఠశాలను కట్టించామని, భవిష్యత్తులో ఈ బడి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల మధ్య బర్త్ డే జరుపుకున్నారు. విద్యార్థులు, మంత్రితో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment