సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్ సస్పెషన్ వేటు వేశారు. ఈ సెషన్ ముగిసే వరకు సభకు రావొద్దని ఆ ముగ్గురిని స్పీకర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారు. స్పీకర్ సూచనలు పట్టించుకోకుండా పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది.
ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల హామీపై స్పష్టతకు టీడీపీ సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. అయితే అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శింస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. స్పీకర్ ఆదేశాలను పాటించకుండా పోడియం వైపు దూసుకొచ్చారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ దీనిని ఆమోదించారు. అయినప్పటీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేయడంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment