వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో లేక ఏడవాలో అర్ధం కావడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు సలహా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తానే ఇచ్చానని చంద్రబాబు చెప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు.. పూటకో మాట, రోజుకో అబద్ధం ఆడటం బాబు నైజమని ధ్వజమెత్తారు.
నోట్ల రద్దు సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబుకు అప్పుడు నోట్ల రద్దు తప్పు అని తెలియలేదా అని సూటిగా అడిగారు. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి అంటున్నావు. మీరు చేసిన పాపం కాదా, బీజేపీతో అంటకాగి ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం తాగుతున్నాయి. రెండు ప్రభుత్వాలు దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నాయి. పెట్రోలు, డీజిల్‌లో వస్తున్న డబ్బు అంతా ఏమైపోతుంది. ధరలు పెరిగితే తగ్గిస్తానన్నావ్ కదా చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపవు’ అని సూటిగా అడిగారు.
చంద్రబాబు నోటిని ఫినాయిల్‌తో కడిగినా సరిపోదని తీవ్రంగా దుయ్యబట్టారు. లోకేష్ టాక్స్‌ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ధరలు పెంచడంలో నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఉపన్యాసాలు ఆపి ధరలు నియంత్రించాలని హితవు పలికారు. అనవసర, అసత్య ఆరోపణలు చేస్తోన్న వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలతో మెడలతో వంచుతామని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment