ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలంగాణం’ | Tough fight to Congress and Communists parties in the first elections of Telangana | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలంగాణం’

Published Thu, Oct 25 2018 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Tough fight to Congress and Communists parties in the first elections of Telangana - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న నాటి గవర్నర్‌ చందూలాల్‌ మాధవ్‌లాల్‌ త్రివేది

తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. దేశమంతా కాంగ్రెస్‌ హవా ఏకపక్షంగా వీస్తున్నా.. తెలంగాణలో మాత్రం వామపక్ష నేతలు ఆ జోరును సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ రెండోసారి ఎన్నికల నాటికి పరిస్థితిలో పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల నాటికి మద్రాసు స్టేట్‌ నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి తెలంగాణలో కలిసి.. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. అప్పటివరకు హైదరాబాద్‌ స్టేట్‌లోని కన్నడ, మరాఠా ప్రాంతాలు అప్పటి మైసూరు, బొంబాయి స్టేట్స్‌లో కలిసి పోయాయి. అయితే 1957లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం తెలంగాణలో మాత్రమే జరిగాయి. ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు పీడీఎఫ్‌ పేరుతోనే పోటీచేశారు.

తెలంగాణ సభ్యుల రెండోసారి ప్రమాణం.. 
ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిపి) ఆవిర్భావం తర్వాత 1957లో తెలంగాణ జిల్లాల పరిధిలోని స్థానాలకు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనూ (తెలంగాణ ప్రాంతంలోని సీట్లతో కలిపి) 1957లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన దరిమిలా హైదరాబాద్‌ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు 101 మంది 1956 డిసెంబర్‌ 3న ఏపీ ఎమ్మెల్యేలుగా మరోసారి ప్రమాణం చేశారు. ఈ కొత్త అసెంబ్లీకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు శాసనసభాపతిగా, తెలంగాణకు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల ఐదేళ్ల కాలపరిమితి ముగియడంతో 1957 ఫిబ్రవరి 25న ఈ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.  

రెండేళ్లు అదనంగా ఏపీ ఎమ్మెల్యేలు.. 
ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు 1955లో జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకు కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల కాలపరిమితి 1962 వరకు ఉండడంతో (1957లో ఎన్నికలు జరిగినందున) ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు. ఈ విధంగా 1962లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిపి) లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలైంది. 1957లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1961లో ద్విసభ్య నియోజకవర్గాల రద్దు చట్టం అమల్లోకి రావడంతో ఈ విధానం రద్దయింది. దీంతో 1962 ఎన్నికల నుంచి ఏకసభ్య నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగాయి. 

1957 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా భారతీయ జన్‌సంఘ్, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్, ప్రజాపార్టీ, ఆల్‌ ఇండియా షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ ఫెడరేషన్, పీజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీలతో పాటు స్వతంత్రులు వివిధ స్థానాలకు పోటీచేశారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 109 సీట్లకు పోటీ చేసి 68 సీట్లు గెలుపొందగా.. 65 సీట్లకు పోటీ చేసిన పీడీఎఫ్‌ 22 చోట్ల విజయం సాధించింది. ప్రజాసోషలిస్టు పార్టీ, ప్రజాపార్టీ, షెడ్యూల్‌ కాస్ట్స్‌ ఫెడరేషన్‌ ఒక్కో స్థానంలో విజయం సాధించారు. స్వతంత్రులు 12 చోట్ల గెలుపొందారు. అప్పుడు అసెంబ్లీకి ఎన్నికైన నామినేటెడ్‌ సభ్యుడి పేరు టీటీ ఫెర్నాండేజ్‌.  

ఆంధ్రాలోనూ కాంగ్రెస్‌ హవా.. 
ఆంధ్ర ప్రాంతంలోని 28 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ 24 స్థానాలు కైవసం చేసుకుంది. సీపీఐ రెండు, స్వతంత్రులు మరో రెండు సీట్లలో గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి ఎన్‌జీ రంగా (తెనాలి), మండలి వెంకటకృష్ణారావు (మచిలీపట్నం), కొత్త రఘురామయ్య (గుంటూరు), ఎం.అనంతశయనం అయ్యంగార్‌ (చిత్తూరు), పెండేకంటి వెంకటసుబ్బయ్య (ఆదోని) వంటి ప్రముఖ నాయకులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ నుంచి తరిమెల నాగిరెడ్డి (అనంతపురం), సీపీఐ నుంచే ఉద్దరాజు రామం (నరసాపురం), ఇండిపెండెంట్‌గా పూసపాటి విజయరామ (పీవీజీ), గజపతిరాజు (విశాఖపట్టణం) లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

తగ్గని మహిళా చైతన్యం 
ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కలుపుకుని మొత్తం 17 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 11 మంది, పీడీఎఫ్‌ నుంచి ఇద్దరు, పీఎస్‌పీ నుంచి ఒకరు, స్వతంత్రులు ముగ్గురు పోటీచేశారు. వారిలో పదిమంది విజయం సాధించారు. వీరిలో బాన్స్‌వాడ నుంచి సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 1952తో పాటు 1957లోనూ మాసుమా బేగం గెలిచారు. ఇందులో టీఎన్‌ సదాలక్ష్మి 1960–62 మధ్య డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 

ఆర్మూర్‌లో అంజయ్య, మంథని నుంచి పీవీ 
ముషీరాబాద్‌ నుంచి కె. సీతయ్యగుప్తా, బేగం బజార్‌ నుంచి జేవీ నరసింగరావు, ఆసిఫ్‌నగర్‌ నుంచి వీబీ రాజు, హైకోర్టు నియోజకవర్గం నుంచి గోపాలరావు ఎగ్బోటే, జూబ్లీహిల్స్‌ జనరల్‌ నుంచి నవాబ్‌ మెహదీ నవాబ్‌జంగ్, షాబాద్‌ జనరల్‌ నుంచి కొండా వెంకట రంగారెడ్డి, వికారాబాద్‌ జనరల్‌ నుంచి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి, జహీరాబాద్‌ నుంచి ఎం.బాగారెడ్డి, ఆర్మూర్‌ నుంచి టి. అంజయ్య, మంథని నుంచి పీవీ నరసింహారావు (మొదటిసారి ఎమ్మెల్యే), కరీంనగర్‌ నుంచి జె.చొక్కారావు, ధర్మసాగర్‌ నుంచి టి.హయగ్రీవాచారి, చిల్లంచెర్ల నుంచి ఎమ్మెస్‌ రాజలింగం, ఖమ్మం నుంచి టి.లక్ష్మీకాంతమ్మ, చిన్నకొండూరు నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ వంటి ముఖ్యæ నాయకులు కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందిన వారిలో ఉన్నారు. వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు సోదరుడు కొండలరావు కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు. నాగర్‌కర్నూల్‌ (ఎస్‌సీ) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పి. మహేంద్రనాథ్‌ గెలుపొందారు. 

సార్వత్రిక ఎన్నికల్లో.. 
1957లో తెలంగాణ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని మొత్తం 43 లోక్‌సభ సీట్లలో 27 ఏకసభ్య, 8 ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. వాటిలో తెలంగాణ ప్రాంతంలో 15 ఎంపీ సీట్లు (మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ ద్విసభ్య నియోజకవర్గాలు కలిపి), ఆంధ్ర పరిధిలో 28ఎంపీ స్థానాలకు (5 ద్విసభ్య నియోజకవర్గాలతో సహా) ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 13 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, పీడీఎఫ్‌ రెండు స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున జె.రామేశ్వరరావు (మహబూబ్‌నగర్‌), వినాయక్‌రావు (హైదరాబాద్‌), సంగెం లక్ష్మీబాయి (వికారాబాద్‌) తదితర నేతలు విజయం సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థులుగా దేవులపల్లి వెంకటేశ్వరరావు (నల్లగొండ), విఠల్‌రావు (ఖమ్మం) గెలుపొందారు. 

ఉప ఎన్నికల విజేతలు 
1958లో బుగ్గారం జనరల్‌ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి, కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి కాంగ్రెస్‌టికెట్‌పై పోటీచేసిన ఎల్‌.నరసింహారావుపై గెలిచారు. 1959లో ఆసిఫ్‌నగర్‌ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసిన ఎన్‌పీ జైస్వాల్‌పై.. స్వతంత్ర అభ్యర్థి వీఆర్‌రావు గెలిచారు. 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ జనరల్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై రోడామిస్త్రీ విజయం సాధించారు. ఆమె ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎంజేఏ బేగ్‌పై గెలుపొందారు. 

సరోజిని నాయుడు కొడుకు ఓటమి
హైకోర్టు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన డాక్టర్‌ ఎన్‌.ఎం. జయసూర్య (సరోజిని నాయుడు, డా.ముత్యాల గోవిందరాజులు నాయుడు కుమారుడు)ను కాంగ్రెస్‌ అభ్యర్థి గోపాలరావు ఎగ్బోటే ఓడించారు. సిర్పూర్‌ (ఎస్సీ) సీటు నుంచి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ (పీఎస్‌పీ) అభ్యర్థి కోదాటి రాజమల్లు కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీపడిన నెమురుగొమ్ముల యతిరాజారావుపై పీడీఎఫ్‌ అభ్యర్థి ఎస్‌.వెంకటకృష్ణ ప్రసాదరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 319 అభ్యర్థులు పోటీ చేయగా.. 81 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 

1957 శాసనసభ ఎన్నికల్లో... 
మొత్తం ఓటర్లు 75,58,880 (ద్విసభ్య నియోజకవర్గాలు కలిపి) 
పోలైన ఓట్లు 36,03,585
పోలింగ్‌ శాతం 47.67  

‘ద్విసభ్య’ జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ మహానగరంలో జూబ్లీహిల్స్‌ ప్రాంతం 1957 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ ద్విసభ్య నియోజకవర్గం. అంటే ఒక జనరల్‌ సీటుతో పాటు మరో సీటు ఎస్సీలకు రిజర్వ్‌చేశారు. 1952, 1957 ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గాల్లో ఎస్సీలకు ఒక సీటు చొప్పున రిజర్వ్‌చేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement