
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ప్రాతిపదికన తమకు 45 స్థానాల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు పార్టీలోని బీసీ నేతలు ఏఐసీసీ పెద్దలను కలసి విన్నవించినట్లు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ నియమించిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీని కలసి వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలు పోటీ చేయాలనుకుంటున్న, విజయావకాశాలున్న స్థానాల జాబితాను కూడా అందజేశారు.
కానీ, 45 స్థానాల కేటాయింపు సాధ్యం కాదనే అంచనాల నేపథ్యంలో కనీసం పార్లమెంట్ స్థానానికి 2 సీట్లయినా బీసీలకు కేటాయించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం బీసీ నేతలకు వస్తుందని అంటున్నారు. అయితే, రాష్ట్ర పార్టీలోని బీసీ నేతల ప్రతిపాదనలను ఏఐసీసీ వర్గాలు సీరియస్‌గానే తీసుకున్నాయని, సామాజిక న్యాయం కోణంలో కనీసం 30 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.
కొన్ని క్లియర్.. మరికొన్ని డౌటే...
బీసీ నేతలు కోరుతున్న విధంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి టీపీసీసీలో కూడా కొంత స్పష్టత ఉంది. కనీసం 25 స్థానాల్లో బీసీ నేతలకు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నందున వారికి అవకాశమివ్వాలని టీపీసీసీ ముఖ్యులు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ ఆ 25 స్థానాలకు బీసీ నేతల పేర్లే మొదటి పేరుగా సూచించినట్లు సమాచారం.
మిగిలిన చోట్ల కూడా కొన్ని స్థానాల్లో బీసీ నేతలను ప్రతిపాదించారని, వాటిలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశం వస్తుందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలేరు, జనగామ, పరకాల, ముషీరాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, బాల్కొండ, మునుగోడు, అంబర్‌పేట, కరీంనగర్, నిజామాబాద్ (టౌన్), ఆర్మూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పటాన్‌చెరు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, హుస్నాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి, కొత్తగూడెం, రామగుండం, భువనగిరి, వరంగల్ (ఈస్ట్), ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని టీపీసీసీ బీసీ నేతలు పార్టీ అ«ధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం.
ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన..
రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన చోట్ల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఎస్సీల్లోని ప్రధాన కులాలయిన మాదిగ, మాలలతో పాటు ఇతర ఉపకులాలకు చెందిన నేతలు బరిలో దిగే అవకాశమున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వస్తోంది.
ఇదే విషయమై మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నేతలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటించారని, తాము కూడా అదే కోవలో ముందుకు వెళ్లాల్సి వస్తుందని టీపీసీసీ చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment