రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ ఇస్తారా?  | TPCC Likely To Issue Notice To Komatireddy Raj Gopal Reddy | Sakshi
Sakshi News home page

రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ ఇస్తారా?

Published Mon, Jun 17 2019 1:42 AM | Last Updated on Mon, Jun 17 2019 1:42 AM

TPCC Likely To Issue Notice To Komatireddy Raj Gopal Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై ఆరా తీసిన అధిష్టానం పెద్దలు... ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ సహా నేతలందరిపై విమ ర్శలు చేసిన రాజగోపాల్‌రెడ్డిపట్ల ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటే పార్టీ మారేందుకు ఆయనకు అవకాశం ఇచ్చిన వారవుతామనే భావనలో ఉన్న గాంధీ భవన్‌ వర్గాలు ఇప్పుడు ఏం చేస్తాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

నేడు కమిటీ భేటీ... 
వాస్తవానికి ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు సోమవారం భేటీ కావాలని పార్టీ క్రమశిక్షణా సంఘం గతంలోనే నిర్ణయించింది. ఈలోగా రాజగోపాల్‌ వ్యవహారం కూడా తెరపైకి వచ్చినందున సోమవారం జరగనున్న భేటీలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. రాజగోపాల్‌ వ్యాఖ్యలను సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవసరమనుకుంటేనే ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్‌ జారీ చేసి రాజగోపాల్‌పై చర్యలకు ఉపక్రమిస్తే ఆయనకు పార్టీ మారే స్వేచ్ఛను తామే ఇచ్చినట్టు అవుతుందని, ఆ వ్యూహంతోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, రాజగోపాల్‌ ట్రాప్‌లో తాము ఎలా పడతామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం.

తమపై ఆరోపణలు చేసే ముందు రాజగోపాల్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని, సొంత మండలంలో తన సోదరుడిని జెడ్పీటీసీగా గెలిపించుకోలేకపోవడంలో బాధ్యులెవరని ఆ నేత ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి 19 వేల మెజారిటీ వస్తే ఎంపీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డికి కేవలం 4 వేల మెజారిటీయే వచ్చిందని, దీనికి బాధ్యులెవరో రాజగోపాల్‌రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. రాజగోపాల్‌ వ్యూహాన్ని తిప్పికొడతామని, పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని, అప్పుడు స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ వ్యవహారంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై టీపీసీసీ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. రాజగోపాల్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన పని లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.  

కాంగ్రెస్‌లోనే ఉంటా... 
తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. రాజగోపాల్‌ వ్యాఖ్యలతో తనకేం సంబంధం లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మొదటి నుంచీ చెబుతున్నానని, దానికే కట్టుబడి ఉంటానని వెంకట్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ చెరో బాట పడతారా? కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటుందా.. కనీసం షోకాజ్‌ నోటీసు అయినా ఇస్తుందా లేక రాజగోపాల్‌ వ్యూహాన్ని తిప్పికొట్టేలా వ్యవహరించి ఆయన పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేçస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. 

ముఖ్యులతో రాజగోపాల్‌ సంప్రదింపులు... 
పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదివారం పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తనతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో ఆయన మాట్లాడినట్టు సమాచారం. పార్టీపై తాను ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది వారికి వివరిస్తూనే భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలకు అండగా ఉండాలని ఆయన కాంగ్రెస్‌ ముఖ్యులను కోరుతున్నట్టు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement