
టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్
సాకి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అరకొర అంశాలతో అసంపూర్తిగా, అస్పష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ పథాకానికి విధివిధానలపై కనీస వివరణ కూడా లేదని ఆయన మండిపడ్డారు. దేశం అంటే రాష్ట్రాల సముదాయమని అన్న ఆయన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు సంప్రదించలేదంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సుమారు 40శాతం మందికి కేవలం రూ.2 వేల కోట్లతో చికిత్స ఎలా అందిస్తారో వివరణ ఇవ్వలన్నారు. ఇన్సూరెన్స్ మోడల్‌లో స్కీమ్ ప్రధానంగా రూపొందితే పాలసీదారులు పెరిగేకొద్దీ ప్రీమియం తగ్గుతుందన్న ఆయన కేవలం రూ.2వేల కోట్ల ప్రారంభ నిధితో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు.
అలాగే వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించే అంశం, మద్దతు ధర విషయంలోను స్పష్టత లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని వెల్లడించిన జైట్లీ, విధి విధానాలు ప్రకటించడంలో మాత్రం విఫలమయ్యారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి ఆయుష్మాన్‌భవ, పంటల మద్దతు ధరపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్పష్ట అంశాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదని వినోద్ అన్నారు.