
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జోరుమీదున్న టీఆర్‌ఎస్.. అదే ఉత్సాహంతో పల్లెల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడిస్తోంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా, బుధవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 334 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 291 పంచాయతీలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుబోతోంది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 8 పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్ని క కానుండగా, 3 పంచాయతీల్లో న్యూడెమోక్రసీ మద్దతుదారులు, సీపీఎం, బీజేపీలు ఒక్కో పంచాయతీపై జెండా ఎగరేయనున్నారు. 35 పంచాయతీల్లో ఏ పార్టీకి సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా గెలవనున్నారు. సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పార్టీల మద్దతుదారులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఎక్కడా దక్కలేదు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు స్థానాలపై ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేయలేదు.
పెరగనున్న ఏకగ్రీవాలు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతు న్న 4,480 పంచాయతీలకు గానూ.. 27,940 సర్పంచ్ స్థానాలకు, 39,832 వార్డులకు 97,690 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. గురువారం నామినేషన్ల పరిశీలన నిర్వహించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనలో తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్‌ను శుక్రవారం స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రత్యర్థులు, అసమ్మతి అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరింపజేసేలా.. గ్రామాభివృద్ధి కమిటీలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంప్రదింపులు, బేరసారాలు కొలిక్కి వస్తే వందల సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవమయ్యేందుకు అవకాశముంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
నేటి నుంచి రెండో విడత పంచాయతీ
రెండో విడత పంచాయతీ ఎన్నికల సంరంభం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న నామినేషన్లను పరిశీలించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలనలో తీసుకున్న నిర్ణయాలపై అప్పీళ్లను స్వీకరించి 16 నాటికి పరిష్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు అవకాశం ఉండనుంది. 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.