మేం వస్తే సీపీఎస్‌ రద్దు | Uttam kumar reddy about cps system | Sakshi
Sakshi News home page

మేం వస్తే సీపీఎస్‌ రద్దు

Published Sun, Aug 26 2018 3:59 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam kumar reddy about cps system - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1,17,782 మంది ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయని పక్షంలో తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని, ఈ అంశమే ఉద్యోగుల విషయంలో తీసుకునే మొదటి నిర్ణయం అవుతుందని ప్రకటించారు. శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు గాంధీభవన్‌ లో ఉత్తమ్‌ను కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఎస్‌ కారణంగా ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తర్వాత పింఛన్‌ లేకుండా పోతోందన్నారు.

ఈ విధానం అమల్లోకి వచ్చాక మృతిచెందిన 174 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ ఉద్యోగులకు డెత్‌కమ్‌ గ్రాట్యుటీ ఇస్తానని సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది మే 16న ఉపాధ్యాయ సంఘాలతో చర్చల సందర్భంగా మాట ఇచ్చారని, ఇంతవరకు ఆ జీవో విడుదల కాలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త పింఛన్‌ విధానంలో ఉంటారా? పాత పింఛన్‌ పద్ధతి లోనే కొనసాగుతారా అని పీఎఫ్‌ఆర్‌డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిందని.. తాము కొత్త పింఛన్‌ విధానంలో ఉంటామని కేసీఆర్‌ జీవో 28 విడుదల చేశారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

సీఎం మజాక్‌ చేస్తున్నారు..
తాము ఎట్టి పరిస్థితుల్లో 100 సీట్లు గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను ఉత్తమ్‌ కొట్టిపారేశారు. సీఎం మజాక్‌ చేస్తున్నారని, ఆయన వేరే రాష్ట్రంలో సర్వేలు చేయించుకుని ఉంటారని ఎద్దేవా చేశారు. తాము తెలంగాణలో చేసిన సర్వేల్లో కాంగ్రెస్‌ 75 సీట్లు గెలుస్తుందని తేలిందన్నారు. ఎన్నికలు ఎప్పు డొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.


అది దోపిడీ సభ...
అనంతరం ఉత్తమ్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోంది ప్రగతి నివేదన సభ కాదని, దోపిడీ సభ అని, ప్రగతి లేని నివేదన సభ అని వ్యాఖ్యానించారు. తన నాలుగున్నరేళ్ల పాలనలో ఏం సాధించారని కేసీఆర్‌ సభ పెడుతున్నారని ప్రశ్నించారు. ఏడు గంటల పాటు మంత్రులతో సమావేశమైన కేసీఆర్‌ ఆ సమావేశ వివరాలను మీడియాకు ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఈసారి ఎన్నికలకు రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజకవర్గానికి మేనిఫెస్టో ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఉత్తమ్‌ చెప్పారు.

బయ్యారం ప్రస్తావన లేకపోవడం దారుణం
సీఎల్పీ ఉపనేత పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన వినతిపత్రంలో కనీసం బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేకపోవడం దారుణమని సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు–తెలంగాణ హక్కు అంటూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలు ఎలుగెత్తి చాటిన ఆకాంక్ష పట్ల కేసీఆర్‌ ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాయో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement