ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.1957 నుంచి 2014 ఎన్నికల వరకు ఇదే జరిగింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తుందో నిర్ణయిస్తున్న ఆ నియోజకవర్గం వల్సాద్. గుజరాత్‌లో ఉంది. ఒక్కసారి మినహా ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీయే కేంద్రంలో అధికారం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 1967 వరకు కాంగ్రెస్ అభ్యర్ధిదే గెలుపు. అప్పటి వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 1971లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ చీలిక వర్గం కాంగ్రెస్(ఓ) అభ్యర్థి గెలిచారు.
అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఐ కేంద్రంలో అధికారం చేపట్టింది. దీన్ని మినహాయిస్తే మిగతా ఎన్నికల్లో ఎప్పుడూ వల్సాద్ జోస్యం తప్పు కాలేదు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఇందిరా గాంధీ హత్య దరిమిలా 1984లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించారు. అప్పట్లో రాజీవ్ గాంధీ నియోజకవర్గ పరిధిలోని లాల్ దంగ్రిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టింది. 1989లో ఈ నియోజకవర్గం జనతాదళ్‌కు ఓటు వేసింది. ఆ పార్టీ నేత వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో వల్సాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పటేల్ గెలిచారు. పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1996,1998,1999 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం బీజేపీకి పట్టం కట్టింది. మూడు సార్లు కూడా బీజేపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2004 ఎన్నికల్లో సోనియా గాంధీ లాల్ దంగ్రీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2014లో మోదీ హవా ప్రభావం ఇక్కడ కూడా పడింది. వల్సాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారి లోక్‌సభలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వల్సాద్ ను మొదట్లో బల్సార్‌గా పిలిచేవారు. పునర్విభజన తర్వాత దీనిపేరు వల్సాద్‌గా మారింది. ఇక్కడి 16 లక్షల ఓటర్లలో 11 లక్షల మంది ఎస్‌టీలే. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు ఎస్టీలకు రిజర్వుచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జితు చౌదరి, బీజేపీ నుంచి కెసీ పటేల్ పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment