
సాక్షి, విజయవాడ: గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు కూడా ఆదే రీతిలో ప్రవర్తిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వందరోజుల పాలన కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు మంత్రి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనసేన నాయకులు పార్టీలోకి చేరటాన్ని స్వాగతిస్తున్నానని, పార్టీలో చేరే నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్నారని, ఆయన పాలన నచ్చే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక యువతకు పరిశ్రమలో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా బిల్లు తెచ్చామని, దేశ చరిత్రలోనే కాంట్రాక్ట్ పనులు రిజర్వేషన్ల ప్రకారం అమలు జరగాలని చెప్పిన నాయకులు సీఎం జగన్ ఒక్కరేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
చదవండి : సీఎం జగన్‌ను కలిసిన పృధ్వీరాజ్