
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న విజయ్ చందర్, చిత్రంలో రౌతు సూర్యప్రకాశరావు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు
సాక్షి, రాజమహేంద్రవరం: మొదటిసారిగా తెలుగుదేశం, సీఎం చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భవిష్యత్‌లో మళ్లీ టీడీపీతో కలÐవబోమని ప్రకటించగలరా? అని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ ప్రచారవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.విజయ్‌చందర్ ప్రశ్నించారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావుతో కలసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. కలసి పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్న భావనతో వేర్వేరుగా పోటీ చేసేందుకు చంద్రబాబు అడుతున్న నాటకంలో భాగంగానే పవన్ కల్యాణ్ విమర్శలు చేశారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. వేర్వేరుగా పోటీ చేసి సీట్లు సాధించి ఆ తర్వాత కలసి అధికారం అనుభవించాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ఉన్నారని ఆరోపించారు. అప్పుడు పవన్‌ను చంద్రబాబు పావుగా వాడుకున్నాడని, ఇప్పడు అదే పావును బయటకు పంపి వాడుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడని ఆరోపించారు. నాలుగేళ్లుగా లేనిది ఇప్పుడే తెలిసినట్టు పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం తనయుడు లోకేష్‌పై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు అవినీతిపై మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మంచివాడని, అమాయకుడని, అయితే సీఎం చంద్రబాబు వేసిన బోనులో చిక్కుకున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ ఆమరణదీక్షకు కూర్చున్న రోజునే తానూ దీక్ష చేస్తానని ప్రకటించారు.
ప్రజలు గుణం పాఠం తప్పక చెబుతారు
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై అనేక ప్రకటనలు చేసి అవహేళన చేసిన సీఎం చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ఉందనగా హోదాపై పోరాటం చేస్తున్నామంటూ నాటకాలు ఆడుతున్నారని రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. మోదీ పక్కన పెట్టాడని ఇప్పడు ప్రత్యేకహోదా అంటున్నాడని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం అను చెప్పకుంటున్న సీఎం చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో ప్రజలు అధికారం కట్టబెడితే నాలుగేళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క హమీ కూడా నెరవేర్చని చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రచారకమిటీ రాష్ట్ర ప్రచారవిభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తిరుపతి సభలో మోదీ, చంద్రబాబు ఇచ్చిన హామీలకు తనది పూచీ అన్న పవన్ కల్యాణ్ ఇప్పడు ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్ పిల్లి నిర్మల, వివిధ విభాగాల అధ్యక్షులు, నేతలు మార్తి లక్ష్మి, పెద్దిరెడ్ల శ్రీను, మార్తి నాగేశ్వరరావు, పోలు విజయలక్ష్మి, పెంకె సురేష్, కాటం రజనీకాంత్, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, కట్టా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.